Telugu Global
Telangana

మాట మార్చిన రేవంత్.. ఉచిత విద్యుత్ పై ట్వీట్

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు అని రేవంత్ చెప్పాలనుకుంటున్నారు. అందుకే ట్వీట్ ద్వారా 24గంటల విద్యుత్ అంటూ హైలెట్ చేశారు.

మాట మార్చిన రేవంత్.. ఉచిత విద్యుత్ పై ట్వీట్
X

ఉచిత విద్యుత్ గురించి అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్ ని బాగానే డ్యామేజ్ చేశాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ చేసిన ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో రైతుల్లో ఆలోచన మొదలైంది. కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న 24గంటల ఉచిత విద్యుత్ గురించి మరోసారి రైతాంగం గొప్పగా చెప్పుకుంటోంది. పరోక్షంగా సీఎం కేసీఆర్ మైలేజీ పెరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటలు, 8 గంటలు కరెంటు ఇస్తామంటున్నారని, రైతుల్ని దగా చేస్తారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టారు. నాణ్యమైన విద్యుత్ అనే మాటను బలంగా జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్న రేవంత్ రెడ్డి.. తాజాగా 24 గంటల ఉచిత విద్యుత్ అంటూ ట్వీట్ చేశారు.


కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది…

వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుంది.

కరెంటు అవినీతిని అంతం చేస్తుంది. అంటూ ట్వీట్ వేశారు రేవంత్ రెడ్డి. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు అని రేవంత్ చెప్పాలనుకుంటున్నారు. అందుకే ట్వీట్ ద్వారా 24గంటల విద్యుత్ అంటూ హైలెట్ చేశారు.

తెలంగాణలో నాణ్యమైన విద్యుత్ అందుబాటులో లేదని, కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయని, కోతలు ఎక్కువగా ఉన్నప్పుడు 24గంటలు కరెంటు ఇచ్చి ఉపయోగం ఏంటని నిలదీస్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఆయన ఎకరాకు గంట అనే ప్రతిపాదనతో ఇరుకున పడ్డారు. తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారని, సగటు కమతాల విస్తీర్ణం 3 ఎకరాలుగా ఉందని, అందుకే రైతులకు 3 గంటలు ఉచిత విద్యుత్ చాలని అమెరికాలో అన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఈ వ్యాఖ్యల్ని వైరల్ చేసింది. దీంతో రేవంత్ సహా కాంగ్రెస్ కూడా ఇరుకున పడింది. అందుకే ఆయన హడావిడిగా అమెరికానుంచి తిరిగొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. తన వ్యాఖ్యల్ని ఎడిట్ చేసి తప్పుగా చూపించారన్నారు. ఇప్పుడు 24 గంటల ఉచిత విద్యుత్ కి కాంగ్రెస్ సిద్ధమేనంటూ ట్వీట్ వేశారు.

First Published:  15 July 2023 1:33 PM IST
Next Story