నెలరోజుల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్..
నెలరోజుల పాలనను తన దృష్టికోణంలో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పాలన తనకు తృప్తినిచ్చిందన్నారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులవుతోంది. ఈ నెలరోజుల్లో కొన్ని హామీలు అమలయ్యాయి, మరికొన్ని పట్టాలెక్కాయి, ఇంకొన్నిటికి దరఖాస్తులు స్వీకరించారు. ఇక రాజకీయం విషయానికొస్తే.. శ్వేతపత్రాలంటూ గత ప్రభుత్వం తప్పులు చేసిందంటూ ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. స్వేదపత్రం అంటూ బీఆర్ఎస్ నేతలు కౌంటర్లిచ్చారు. 420 హామీలంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో నెలరోజుల పాలనను తన దృష్టికోణంలో వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పాలన తనకు తృప్తినిచ్చిందన్నారు.
"సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ, పాలనను ప్రజలకు చేరువ చేస్తూ, అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది.
పేదల గొంతుక వింటూ, యువత భవితకు దారులు వేస్తూ, మహాలక్ష్ములు మన ఆడబిడ్డల మొఖంలో ఆనందాలు చూస్తూ, రైతుకు భరోసా ఇస్తూ, సాగిన నెల రోజుల నడక ఉజ్వల భవిత వైపునకు అడుగులు వేస్తోంది.
పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ, పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట వేస్తూ, నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ, మత్తులేని చైతన్యపు తెలంగాణ కోసం గట్టి పట్టుదలతో సాగిన ఈ నెల రోజుల పాలన బాధ్యతగా సాగింది.
రేవంతన్నగా నన్ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా. " అంటూ ట్వీట్ వేశారు రేవంత్ రెడ్డి..
సంకెళ్లను తెంచి, స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది.
— Revanth Reddy (@revanth_anumula) January 7, 2024
సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ… పాలనను ప్రజలకు చేరువ చేస్తూ… అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ జరిగిన నెల రోజుల ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది.
పేదల గొంతుక… pic.twitter.com/gkzpRy1zGT
ఇట్లు మీ రేవంతన్న
సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా తనను తాను రేవంతన్న అని పేర్కొంటూ ట్వీట్ చేయడం విశేషం. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. చాలామంది రేవంతన్నా అంటూ ఆయన్ను సంబోధిస్తున్నారు. ఆమధ్య ఓ ఆస్పత్రిలో బిడ్డ వైద్యం కోసం ఓ మహిళ రేవంతన్నా అని సీఎంని పిలవడం, అక్కడ జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తన ట్వీట్ ని మీ రేవంతన్న అంటూ ముగించారు.