Telugu Global
Telangana

రేవంత్ ఉక్కిరి బిక్కిరి..

వీళ్లందరి మధ్యలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పేరుకి పీసీసీ చీఫ్ అయినా, చుట్టూ అధిష్టానం వీర విధేయులు రేవంత్ కి చుక్కలు చూపెట్టడం ఖాయమని తెలుస్తోంది.

రేవంత్ ఉక్కిరి బిక్కిరి..
X

ఉత్తమ్ కుమార్ రెడ్డికి సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చోటు..

దామోదర రాజ నర్సింహకు సీడబ్ల్యూసీలో స్థానం

షర్మిల వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం..

వెరసి ఈ పరిణామాలన్నిటితో రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పీసీసీ అధ్యక్ష పదవితో తెలంగాణలో పార్టీపై పెత్తనం తనదే అనుకున్న రేవంత్ కి ఇప్పుడు పక్కలో బల్లేలను రెడీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం.

మనకు సరిపడనివారితో కలసి పనిచేయాలంటే పక్కలో బల్లెం పెట్టుకున్నట్టే లెక్క. రాజకీయాల్లో ఇలాంటి వ్యవహారాలు మరీ దారుణంగా ఉంటాయి. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయన జస్ట్ టీపీసీసీకి చీఫ్ మాత్రమే. ఆయన వ్యతిరేక వర్గంగా ఉన్నవారు కేంద్ర కమిటీల్లో సభ్యులుగా పెద్ద పోస్టుల్లోకి వెళ్లిపోయారు. దీంతో రేవంత్ పరిస్థితి దారుణంగా తయారయింది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనర్సింహకు ఇటీవల అధిష్టానం అవకాశమివ్వడంతో రేవంత్ కి షాక్ తగిలింది. పీసీసీ కంటే అది పెద్ద పోస్ట్. ఒకరకంగా కాంగ్రెస్ లో కీలకమైన సీడబ్ల్యూసీలో సభ్యుడంటే, ఇష్టం ఉన్నా లేకున్నా రాష్ట్ర నేతలు గౌరవం ఇవ్వాలి. ఇక్కడే రేవంత్ కి తలకొట్టేసినట్టయింది.

తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో స్థానమిచ్చింది అధిష్టానం. తెలుగు రాష్ట్రాలనుంచి ఆయన ఒక్కరికే ఛాన్స్ లభించింది. సీడబ్ల్యూసీ లాగే సీఈసీ పదవి కూడా పెద్దదే. ఎవరెవరు పోటీ చేయాలి, ఏ స్థానం నుంచి బరిలో నిలబడాలి.. లాంటి వ్యవహారాలను సీఈసీ ఖరారు చేస్తుంది. ఇక్కడ టీపీసీసీ అభ్యర్థులను ఎంపిక చేసినా, అక్కడ సీఈసీ ఆమోద ముద్ర పడాలి. అంటే రేవంత్ రెడ్డికంటే ఉత్తమ్ దే పైచేయి అన్నమాట. విశేషం ఏంటంటే.. ఇటీవలే గాంధీభవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ మధ్య కుటుంబానికి రెండు సీట్ల విషయంలో గొడవ జరిగింది. తాను పీసీసీ అధ్యక్షుడినని తన మాటే చెల్లుబాటు కావాలన్నారు రేవంత్, తనని డిక్టేట్ చేయొద్దని కరాఖండిగా చెప్పేశారు. అక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఉత్తమ్ సీఈసీ మెంబర్ అయ్యారు. రేవంత్ అభ్యర్థిత్వాన్ని కూడా రేపు ఖరారు చేయాల్సింది ఉత్తమ్ కావడం ఇక్కడ అన్నిటికీ మించిన ట్విస్ట్.

ఫైనల్ గా షర్మిల..

తెలంగాణ కాంగ్రెస్ లో పాతకాపులంతా ఒక వర్గంగా ఉన్నారు. వారికి రేవంత్ రెడ్డి అంటే పడదు. టీడీపీ నుంచి వచ్చారనే చిన్నచూపు ఉంది. వైరి వర్గాలు కూడా ప్రస్తుతం తెలంగాణలో ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్ అంటూ సెటైర్లు వేస్తుంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల, కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వైఎస్సార్టీపీ విలీనంతో ఆమెకు కాంగ్రెస్ లో ప్రాధాన్యం పెరుగుతుందనే చెప్పాలి. అంటే వైఎస్ఆర్ తో కలసి పనిచేసినవారు ఆమె వర్గంగా చెలామణి అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. షర్మిల చేరిక విషయంలో కూడా రేవంత్ రెడ్డిని అధిష్టానం పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. రేవంత్ తో చర్చించకుండానే వైఎస్సార్టీపీ విలీనం ఫైనల్ స్టేజ్ కి వచ్చింది.

వి.హనుమంతరావు, జగ్గారెడ్డి వంటి నేతలు ఎలాగూ రేవంత్ కి నేరుగానే కౌంటర్లిస్తుంటారు. వీళ్లందరి మధ్యలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పేరుకి పీసీసీ చీఫ్ అయినా, చుట్టూ అధిష్టానం వీర విధేయులు రేవంత్ కి చుక్కలు చూపెట్టడం ఖాయమని తెలుస్తోంది.

First Published:  5 Sept 2023 7:47 AM GMT
Next Story