Telugu Global
Telangana

సచివాలయంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు

ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా లోపలకు అనుమతించడం కుదరదని పోలీసులు తేల్చి చెప్పడంతో అక్కడ నుంచే డీసీపీకి రేవంత్ ఫోన్ చేశారు.

సచివాలయంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డి.. అడ్డుకున్న పోలీసులు
X

తెలంగాణ కొత్త సచివాలయంలోకి ఎలాంటి అనుమతులు లేకుండా దూసుకెళ్లడానికి ప్రయత్నించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్తుండగా టెలిఫోన్ భవన్ వద్దే ఆయన కారును పోలీసులు ఆపేశారు. ఈ క్రమంలో పోలీసులు, రేవంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నది. తనను సెక్రటేరియట్‌లోకి వెళ్లనీయకుండా అడ్డుకోవడంపై రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పర్సనల్ పని మీద వెళ్లడం లేదని.. ఓఆర్ఆర్ లీజు విషయమై సీఎస్ శాంతికుమారితో మాట్లాడి వివరాలు తెలుసుకోవడానికే సెక్రటేరియట్‌కు వచ్చానని పోలీసులకు తెలిపారు.

కాగా, ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా లోపలకు అనుమతించడం కుదరదని పోలీసులు తేల్చి చెప్పడంతో అక్కడ నుంచే డీసీపీకి రేవంత్ ఫోన్ చేశారు. తాను ఎంపీనని.. ఒక ప్రజాప్రతినిధిని సచివాలయంలోకి వెళ్లనివ్వరా.. నా కారు ఆపేస్తే ఇక్కడే అనుమతి వచ్చే వరకు ఉంటానని డీసీపీతో చెప్పారు. కాగా, సచివాలయంలోని అనుమతిచ్చే విషయం తమ పరిధిలో లేదని డీసీపీ పేర్కొన్నారు. అయితే అనుమతి వచ్చే వరకు కారులోనే కూర్చుంటానని పట్టుబట్టారు.

సచివాలయంలోని ధర్నా చేయడానికో, నిరసన తెలపడానికో వెళ్లడం లేదని.. సమాచార హక్కు చట్టం ప్రకారం కొన్ని వివరాలు తెలుసుకోవడానికి వెళ్తున్నానని రేవంత్ చెప్పారు. తన కారును లోపలకి తీసుకొని వెళ్లడంపై అభ్యంతరం ఉంటే.. పోలీసులే తమ వాహనంలో తీసుకెళ్లాలని చెప్పారు. కాగా, రేవంత్ రెడ్డి కారణంగా ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్త వాతావరణ నెలకొన్నది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుండటంతో అక్కడి నుంచి వెళ్లాలని రేవంత్ రెడ్డిని కోరారు. సచివాలయం సమీపంలో విజిటర్స్ గేటును మూసేసి, అడ్డంగా బారికేడ్లు పెట్టారు. ఎవరూ లోపలకు దూసుకొని వెళ్లకుండా ఈ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.

First Published:  1 May 2023 4:42 PM IST
Next Story