Telugu Global
Telangana

డీకే శివకుమార్‌ వైపు రేవంత్ రెడ్డి.. ప్రియాంక గాంధీ వైపు కోమటిరెడ్డి.. టీపీసీసీలో మరో తలనొప్పి!

కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలుపు బాట పట్టించిన డీకే శివకుమార్‌కు తెలంగాణ ఇంచార్జి బాధ్యతలు ఇవ్వాలని రాష్ట్ర నాయకులు ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు.

డీకే శివకుమార్‌ వైపు రేవంత్ రెడ్డి.. ప్రియాంక గాంధీ వైపు కోమటిరెడ్డి.. టీపీసీసీలో మరో తలనొప్పి!
X

తెలంగాణ కాంగ్రెస్‌లో అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నాయకుల మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. పార్టీ పదవుల కేటాయింపు నుంచి పాదయాత్ర పర్మిషన్ల వరకు ప్రతీ విషయంలో ఇరు వర్గాలు బాహాటంగానే విమర్శలు గుప్పించుకున్నాయి. అయితే, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో కాస్త మార్పు వచ్చినట్లు కనపడింది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనే ఆశ పెరిగింది. కానీ, ఇప్పటికీ కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి వర్గంతో సీనియర్లు విభేదిస్తూనే ఉన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలుపు బాట పట్టించిన డీకే శివకుమార్‌కు తెలంగాణ ఇంచార్జి బాధ్యతలు ఇవ్వాలని రాష్ట్ర నాయకులు ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు. అధిష్టానం కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు కనిపించింది. రేవంత్ రెడ్డి పలు మార్లు బెంగళూరు వెళ్లి డీకేను కలిసి.. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిని వివరించారు. ఎన్నికలకు ముందు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే విషయంపై రేవంత్ రెడ్డి పలు సలహాలు, సూచనలు తీసుకున్నారు. మరో రెండు, మూడు వారాల్లో డీకేకు తెలంగాణ బాధ్యతలను అధికారికంగా ఇవ్వబోతున్నదనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో సోనియా, ప్రియాంకతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

రేవంత్ రెడ్డికి అధ్యక్ష పదవిని అప్పగించడంపై మొదటి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విభేదిస్తున్నారు. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడానికి ముందు పీసీసీ పీసీసీ చీఫ్ రేవంత్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. డబ్బులు ఇచ్చి పదవిని కొనుక్కున్నాడని కోమటిరెడ్డి బ్రదర్స్ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అయితే ఢిల్లీ వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా సోనియా ముందు కొత్త ప్రపోజల్ పెట్టినట్లు సమాచారం.

తెలంగాణ ఇంచార్జి బాధ్యతలను ప్రియాంక గాంధీకి ఇవ్వాలని కోరారు. ప్రతీ పది, పదిహేను రోజులకు ఒక సారి ప్రియాంక గాంధీ తెలంగాణకు వచ్చేలా షెడ్యూల్ రూపొందించాలని కూడా రిక్వెస్ట్ చేశారు. ప్రియాంకకు బాధ్యతలు ఇవ్వాలని కోరినట్లు స్వయంగా వెంకట్ రెడ్డి మీడియాకు వెళ్లడించారు. ఒక వైపు డీకే శివకుమార్‌ను తెలంగాణకు తీసుకొని రావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే.. వెంకట్ రెడ్డి ఏకంగా ఢిల్లీ వెళ్లి ప్రియాంకకు బాధ్యతలు ఇవ్వాలని కోరడం గమనార్హం. పైకి అంతా సర్దుకుందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా... రేవంత్, సీనియర్లకు మధ్య దూరం ఏ మాత్రం తగ్గలేదని ఈ ఘటన తెలియజేస్తోంది.

ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోకి తిరిగి రావడంపై కూడా చర్చించినట్లు తెలుస్తున్నది. ఏ కారణంతో బీజేపీలోకి వెళ్లాల్సి వచ్చిందో కూడా పూర్తిగా వివరించారని.. తిరిగి మునుగోడు టికెట్‌ను కాంగ్రెస్ తరపున తమ్ముడు రాజగోపాల్‌కే కేటాయించేలా అధిష్టానం వద్ద పావులు కదిపినట్లు సమాచారం. కాగా, త్వరలోనే రాజగోపాల్ పునరాగమనంపై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.

కర్ణాటక ఎన్నికల అనంతరం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి.. పార్టీని వీడిన వాళ్లందరూ తిరిగి రావాలని కోరారు. అవసరం అయితే తానే తగ్గి ఉంటారని.. పార్టీ గెలుపు కోసం అందరం పని చేద్దామని విజ్ఞప్తి చేశారు. డీకే శివకుమార్ కూడా వస్తే పార్టీ పూర్తిగా గాడిన పడుతుందని కాంగ్రెస్ శ్రేణులు కూడా నమ్ముతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్‌కు తామ ప్రత్యామ్నాయం అని కూడా కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఇతర పార్టీల్లోకి వెళ్లిన నాయకులు తిరగి కాంగ్రెస్‌లో చేరడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి, సీనియర్ల వర్గం మధ్య ఉన్న విభేదాలే వారిని కలవర పెడుతున్నట్లు తెలుస్తున్నది.

First Published:  16 Jun 2023 6:33 PM IST
Next Story