Telugu Global
Telangana

రేవంత్‌ రెడ్డిని ఎర్రగడ్డ హాస్పిటల్‌లో చూపించాలి

ఆయన ఎన్ని కేసులు పెట్టినా భయపడం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

రేవంత్‌ రెడ్డిని ఎర్రగడ్డ హాస్పిటల్‌లో చూపించాలి
X

సీఎం రేవంత్‌ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారని.. ఆయనను ఎర్రగడ్డ హాస్పిటల్‌లో చూపించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. రేవంత్‌ తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీని, రేవంత్‌ రెడ్డి వెంటాడుతూనే ఉంటామని హెచ్చరించారు. ''రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి బండారం బయటపడటంతో అసెంబ్లీలో ఆగమాగం అయిండు.. అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడారు.. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేయడం నాకు చేతకాదని చెప్పారు.. అసెంబ్లీ సాక్షిగా ఒక కన్ఫ్యూషన్ స్టేట్ మెంట్ ఇచ్చారు.. ఎన్నికలప్పుడు అనుకోకుండా హామీలు ఇచ్చామని.. ప్రభుత్వంలోకి వచ్చాక మాకు పరిపాలన చేయడం రావట్లేదని అసెంబ్లీలో చెప్పకనే చెప్పాడు.. రూ.49,500 కోట్ల రుణాలు ఉంటే రూ.26 వేల కోట్లే మాఫీ చేసిండ్రు.. అయినా సిగ్గు లేకుండా వంద శాతం రుణమాఫీ అయిందని చెప్తున్నడు.. రుణమాఫీపై మేం అసెంబ్లీలో ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. అసెంబ్లీలో ఎట్లా అబద్ధాలు చెప్పాల్నో ఎమ్మెల్యేలకు శిక్షణ సరిగా ఇచ్చినట్టు లేరు.. అందుకే వందశాతం రుణమాఫీ చేశామని చెప్తుంటే.. వెనుకే ఇంకొకాయన 70 శాతమే అయ్యిందని చెప్తున్నడు..'' అన్నారు.

రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా సంపూర్ణంగా రుణమాఫీ జరగలేదని, ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డిపల్లెకి పోయినా ఈ విషయం తెలుస్తుందన్నారు. రైతుబంధు, రైతుభరోసా ఎగ్గొట్టి రుణమాఫీ చేశామని డాంభికాలు చెప్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రైతులకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కాక మోసం చేశారన్నారు. రైతుబంధులో రూ.22 వేల కోట్లు పక్కదారి పట్టాయని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పారని.. ఆ వివరాలు ఇవ్వాలని అడిగితే ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. ముఖ్యమంత్రి సభలో చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవన్నారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి చెప్పే ప్రతీ మాట నమ్మాల్సిన అవసరం లేదన్నారు. వర్షాధార పంటలైన కంది, పత్తి, మొక్కజొన్న లాంటి పంటలు సాగు చేసే భూములకు రెండో పంటకు రైతుబంధు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని తెలిపారు. 45 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్న రైతులకు రెండో పంటకు రైతుబంధు ఇచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదన్నారు.

తెలంగాణలో రైతు ఆత్మహత్యలపైనా అబద్ధాలు చెప్పే దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారిందన్నారు. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్‌ ప్రకారం 2014లో 1,348 రైతులు ఆత్మహత్య చేసుకుంటే, రైతుబంధు పథకం ప్రారంభించిన తర్వాత 2022 నాటికి 178కి తగ్గాయన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లలో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. తెలంగాణ వచ్చేనాటికి రైతు ఆత్మహత్యల్లో 11 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో రాష్ట్రం ఉండేదని.. 2023 నాటికి 1.57 శాతానికి ఆత్మహత్యలను తగ్గించామన్నారు. రేవంత్ రెడ్డికి చరిత్ర, వర్తమానం తెలియదు.. లెక్కలు అసలే తెలియవన్నారు. 1956లోనే తెలంగాణ సర్‌ప్లస్‌ స్టేట్‌ అని.. 1968, 2001లోనూ మనమే ఫస్ట్‌ ప్లేస్‌ లో ఉన్నామన్నారు. తెలంగాణ వచ్చిన రోజు కూడా సర్‌ ప్లస్‌ స్టేట్‌ అని.. ఇందులో కాంగ్రెస్‌ కొత్తగా ఉద్దరించింది ఏమీ లేదన్నారు. రూ.12 వేల కోట్ల రైతు రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లలో రూ.28 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిందని, రైతుబంధు సాయంగా రూ.73 వేల కోట్లు ఇచ్చామన్నారు. నేరుగా రైతుల ఖాతాల్లో రూ.లక్ష కోట్లు జమ చేశామన్నారు. ఉద్యోగులు, ఐటీ కట్టే వారికి రైతుబంధు ఇవ్వబోమని ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. సంక్రాంతి తర్వాత రైతుభరోసా అంటున్నారని.. ఏ సంక్రాంతికో మాత్రం చెప్పడం లేదన్నారు. రైతులకు రైతుభరోసా సాయం పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

First Published:  21 Dec 2024 6:23 PM IST
Next Story