Telugu Global
Telangana

కొడంగల్ గొడ్డళ్లు.. రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్

కొడంగల్ ను రెండు ముక్కలు చేసి కుక్కలు చించిన విస్తరి చేశారని ఆరోపించారు. కొడంగల్ ప్రజలు ఆలోచించాలని, మన బతుకులు మారాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ గెలవాలని పిలుపునిచ్చారు. గ్రూపులు, గుంపులు పక్కనపెట్టి కలిసికట్టుగా కాంగ్రెస్ కు అండగా నిలబడాలని కోరారు రేవంత్ రెడ్డి.

కొడంగల్ గొడ్డళ్లు.. రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్
X

రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, ప్రచారంలో పాల్గొనకుండా ఆయనపై నిషేధం విధించండి అంటూ ఎన్నికల కమిషన్ కి ఓవైపు బీఆర్ఎస్ ఫిర్యాదులు చేస్తోంది. మరోవైపు ఆయన మాత్రం అలాంటి వ్యాఖ్యలు ఆపడంలేదు. తాజాగా కొడంగల్ గొడ్డళ్లు అంటూ ఆయన వేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. సిద్దిపేట నుంచి ఒకరు, సిరిసిల్ల నుంచి ఇంకొకరు, గజ్వేల్ నుంచి మరొకరు కొడంగల్ కి గొడ్డలి తీసుకుని బయలుదేరారని అన్నారు రేవంత్ రెడ్డి. వాళ్ల మోచేతి నీళ్లు తాగేవాళ్లు కూడా ఈ కుట్రలో భాగస్వాములయ్యారని అన్నారు.


మీరు పెంచిన మొక్క వృక్షమైంది..

కోస్గి ప్రజలు రెండు సార్లు అత్యధిక మెజారిటీ ఇచ్చి తనను గెలిపించారని, వారు పెంచిన మొక్క వృక్షమై పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉండే స్థాయికి చేరిందని, ఈసారి కూడా అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి. కొడంగల్ ను సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారని, కానీ ఐదేళ్లలో చేసిందేమీ లేదన్నారు. కొడంగల్ లో గౌడ సోదరులకు, ముదిరాజులకు, దళిత బిడ్డల అభివృద్ధికి తాను కృషి చేశానన్నారు రేవంత్ రెడ్డి. మైనారిటీలకు కమ్యూనిటీ భవనం, మార్కెట్ యార్డు కట్టించింది తానేనన్నారు. నియోజకవర్గానికి ట్రాన్స్ ఫార్మర్లు తెచ్చి అగ్గిపెట్టెల్లా పంచి పెట్టానన్నారు. పదేళ్లు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉండి ఎంతో చేశానని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.

బీఆర్ఎస్ హామీలు మాత్రం కొడంగల్ లో అమలు కాలేదన్నారు రేవంత్ రెడ్డి. కృష్ణా జలాలు వచ్చాయా? పాలమూరు ఎత్తిపోతల పూర్తయిందా? రైల్వే లైన్ తెచ్చిండా? పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఇవేవీ చేయకపోగా కొడంగల్ ను రెండు ముక్కలు చేసి కుక్కలు చించిన విస్తరి చేశారని ఆరోపించారు. కొడంగల్ ప్రజలు ఆలోచించాలని, మన బతుకులు మారాలంటే ఈ గడ్డపై కాంగ్రెస్ గెలవాలని పిలుపునిచ్చారు. గ్రూపులు, గుంపులు పక్కనపెట్టి కలిసికట్టుగా కాంగ్రెస్ కు అండగా నిలబడాలని కోరారు రేవంత్ రెడ్డి.

First Published:  14 Nov 2023 12:23 PM IST
Next Story