దాడుల వెనక ప్రశాంత్ కిషోర్..! రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
2019 ఏపీ ఎన్నికల సమయంలో జగన్ పై కోడికత్తితో దాడి, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతాబెనర్జీ కాలికి గాయం వంటి ఘటనలను ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ నేతలపై జరిగిన దాడుల గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అవన్నీ వట్టి డ్రామాలని కొట్టిపారేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై అసలు దాడి జరగలేదని, అదంతా డ్రామా అని విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణం అని, రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు రేవంత్ రెడ్డి.
ఏపీ, బెంగాల్.. ఇప్పుడు తెలంగాణ..
2019 ఏపీ ఎన్నికల సమయంలో జగన్ పై కోడికత్తితో దాడి, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతాబెనర్జీ కాలికి గాయం వంటి ఘటనలను ప్రస్తావించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, గువ్వల బాలరాజుపై దాడి ఘటనలు కుట్రలో భాగమేనంటున్నారాయన. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రాజకీయ కుట్ర జరుగుతోందన్నారు. ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంటోందని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు.
రేవంత్ పై విమర్శలు..
కత్తిపోటు తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి చావు అంచుల వరకు వెళ్లి బయటపడ్డారు. ఆయన చిన్నపేగుని కత్తిరించి దాదాపు 4 గంటలసేపు వైద్యులు ఆపరేషన్ చేశారు. మొండికత్తి ఘటన అంటూ అప్పట్లో రేవంత్ రెడ్డి కించపరిచేలా మాట్లాడటం విమర్శలకు దారితీసింది. ఇప్పుడు ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై జరిగిన దాడిని కూడా ఆయన తేలిగ్గా తీసిపారేస్తూ మాట్లాడారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండిపడుతోంది. సోషల్ మీడియాలో కూడా ఆయనపై ట్రోలింగ్ మొదలైంది.