బండ్లతో గుండ్లతో అయ్యేదేం లేదు –రేవంత్ రెడ్డి
తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందని చెప్పారు రేవంత్ రెడ్డి. నిరంకుశ పరిస్థితుల నుంచి విముక్తి కల్పించేది కాంగ్రెస్ మాత్రమేనని.. బండ్లతోని, గుండ్లతోని అయ్యేదేం లేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయం అని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బండ్లతో, గుండ్లతో అయ్యేదేం లేదన్నారు. పరోక్షంగా బండి సంజయ్ పై ఆయన విమర్శలు సంధించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోంది అనే వాదనను ఆయన కొట్టిపారేశారు.
మోదీ, కేసీఆర్ పై విమర్శలు..
ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ వైఫల్యాలపై చార్జ్ షీట్ విడుదల చేస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి. నిపుణులు సూచనలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిద్దామన్నారు. తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతోందని చెప్పారు. నిరంకుశ పరిస్థితుల నుంచి విముక్తి కల్పించేది కాంగ్రెస్ మాత్రమేనని.. బండ్లతోని, గుండ్లతోని అయ్యేదేం లేదని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఓట్లు పీకిపారేస్తున్నారు..
ఓటరు జాబితాలో కాంగ్రెస్ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ధరణితో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారని చెప్పారు. దేశానికి మంచి నాయకత్వాన్ని సోనియా అందించారని, ఎముకలు కొరికే చలిలో సైతం రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నారని కొనియాడారు. జనవరి 26న జెండా ఎగరేయడంతో బాధ్యత తీరలేదన్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ప్రతి గడపకు రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.