ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహం..!
గద్దర్ విషయంలో తమ పార్టీ మాత్రం మరింత గౌరవంగా వ్యవహరిస్తుందని చెప్పిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఓ ఆసక్తికర చర్చకు తెర తీశారు.
పోరాటోద్యమాల్లో ముందుండి నడిచి.. తన గళంతో, సాహిత్యంతో ప్రజా వాగ్గేయకారుడిగా, ప్రజా యుద్ధ నౌకగా పేరు గడించిన యోధుడు గద్దర్.. ఇటీవల ఆయన అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. ఆయనకు అంజలి ఘటించే విషయంలో రాజకీయ పార్టీలు సైతం ఒక్కొక్కటీ.. ఒక్కోలా స్పందించాయి. గద్దర్ కు నివాళి అర్పించడంపై శాసనసభలో తీర్మానం పెట్టలేదన్న విమర్శలు కూడా వచ్చాయి. చివరికి ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.
ఇదిలా ఉంటే.. గద్దర్ విషయంలో తమ పార్టీ మాత్రం మరింత గౌరవంగా వ్యవహరిస్తుందని చెప్పిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఓ ఆసక్తికర చర్చకు తెర తీశారు. రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన.. ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చాక.. హైదరాబాద్ లోని ట్యాంక్‌బండ్ పై గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని స్పష్టం చేశారు. అంతే కాదు.. సినిమా రంగానికి ఇచ్చే నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను అందిస్తామని చెప్పుకొచ్చారు.
చరిత్రను సుసంపన్నం చేసిన ఎందరో మహానుభావుల విగ్రహాలతో.. ఇప్పటికే ట్యాంక్ బండ్ అలరారుతోంది. ఇటీవల అదే ప్రాంతానికి సమీపంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం.. అందర్నీ ఆకర్షిస్తోంది. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం కూడా ఏర్పాటయితే.. అది మరింత మందిని ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, అధికార బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారన్నది చూడాల్సిందే.