Telugu Global
Telangana

రాజగోపాల్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి విందు రాజకీయం..

రేవంత్ అనుచరుడు చామల గెలవాలంటే కచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం ఉండాలి. అందుకే రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

రాజగోపాల్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి విందు రాజకీయం..
X

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ కి పెద్ద పరీక్షగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి నెలల వ్యవధిలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో పాస్ మార్కులు రావడం తప్పనిసరిగా మారింది. సీఎంగా రేవంత్ రెడ్డి పాలనకు కూడా ఈ ఎన్నికలు గీటురాయి కాబోతున్నాయి. తమ 100 రోజుల పాలనకు రెఫరెండంగా ఈ ఎన్నికలను పరిగణిస్తామని ఇప్పటికే చాలాసార్లు ఆయన ప్రకటించారు. అందుకే లోక్ సభ ఎన్నికల కోసం ఆయన వ్యూహ రచనలో మునిగిపోయారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి విందు రాజకీయం జరిగింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాపై కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. గత లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీగా గెలిచారు. ఈసారి అన్నదమ్ములిద్దరూ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వెంకట్ రెడ్డికి మంత్రి పదవి కూడా వచ్చింది. రాజగోపాల్ రెడ్డి మాత్రం ఆ పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఇక లోక్ సభ ఎన్నికల విషయానికొస్తే భువనగిరి సీటు తమ కుటుంబానికే దక్కాలని ఆశించారు కోమటిరెడ్డి బ్రదర్స్, అది సాధ్యం కాలేదు, పోనీ తమ అనుచరుల్లో ఒకరికి సీటు ఇప్పించుకోవాలనుకున్నారు. రాజగోపాల్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. అక్కడ రేవంత్ రెడ్డి కోటరీకి చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. దీంతో ఈ గెలుపు రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది.

ఇక్కడ రేవంత్ అనుచరుడు చామల గెలవాలంటే కచ్చితంగా కోమటిరెడ్డి బ్రదర్స్ సహకారం ఉండాలి. అందుకే రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించారు. సమీక్షను కూడా రాజగోపాల్ రెడ్డి ఇంట్లోనే నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి గట్టి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వెంకట్ రెడ్డి ఉండగా రాజగోపాల్ రెడ్డిని కూడా కేబినెట్ లోకి తీసుకోవడం అసాధ్యం. మరి రేవంత్ చెప్పిన ప్రత్యామ్నాయం ఏంటో తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి, కోమటిరెడ్డి బ్రదర్స్ సంపూర్ణ సహకారం అందిస్తారా..? రేవంత్ ఇమేజ్ ని డ్యామేజీ చేసేందుకు చామలకు వెన్నుపోటు పొడుస్తారా..? వేచి చూడాలి.

First Published:  11 April 2024 2:01 AM GMT
Next Story