Telugu Global
Telangana

రేవంత్‌ రెడ్డి పచ్చని పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్నరు

శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి

రేవంత్‌ రెడ్డి పచ్చని పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్నరు
X

సీఎం రేవంత్‌ రెడ్డి పచ్చని పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్నారని శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి అన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్‌ నాయకులు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, పట్నం నరేందర్‌ రెడ్డి కార్తీక్‌ రెడ్డి తదితరులు మంగళవారం కొడంగల్‌ నియోజకవర్గంలోని లగచర్లకు వెళ్తుండగా పోలీసులు మన్నెగూడ క్రాస్‌ రోడ్‌ వద్ద అడ్డుకున్నారు. అనంతరం వారిని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు వికారాబాద్‌ అడిషనల్‌ ఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మధుసూదనాచారి మీడియాతో మాట్లాడుతూ, రేవంత్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను వదిలేసి హైడ్రా పేరుతో హైదరాబాద్‌ ప్రజలను, ఫార్మాసిటీ పేరుతో కొడంగల్‌ వాసులను నిరాశ్రయులను చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు జీరో పొల్యూషన్‌, జీరో వేస్టేజీతో హైదరాబాద్‌ కు సమీపంలో 15 వేల ఎకరాలను ఫార్మాసిటీ కోసం సేకరించారని గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టుకు ఫారెస్ట్‌, ఎన్విరాన్‌మెంట్‌ సహా అన్ని క్లియరెన్స్‌ లు వచ్చిన తర్వాత పక్కన పెట్టారని తెలిపారు. ఇప్పుడు రైతుల పచ్చని పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌ రెడ్డి వారి బాధను అర్థం చేసుకోకుండా అధికారులపై ఒత్తిడి తేవడంతోనే నిన్నటి ఘటన జరిగిందన్నారు. అధికారులపై రైతుల దాడులకు సీఎం రేవంత్‌ రెడ్డే కారణమన్నారు. రైతుల భూములు బలవంతంగా లాక్కోవాలని చూస్తే బీఆర్‌ఎస్‌ ఊరుకోబోదని హెచ్చరించారు. ఇప్పటికైనా రేవంత్‌ తన అనాలోచిత, అహంకారపూరిత నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

First Published:  12 Nov 2024 1:02 PM GMT
Next Story