Telugu Global
Telangana

మా మేనిఫెస్టో కాపీ కొట్టారు.. ప్రమాణానికి సిద్ధమైన రేవంత్

ఆరు గ్యారెంటీలు అమలు కావు అని విమర్శించినవారు, ఇప్పుడు వాటినే ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మొత్తమ్మీద బీఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్ లో కలవరం రేపిందని ఈ రియాక్షన్ తో స్పష్టమవుతోంది.

మా మేనిఫెస్టో కాపీ కొట్టారు.. ప్రమాణానికి సిద్ధమైన రేవంత్
X

బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదలైతే ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అవడం ఖాయం అంటూ ఆ పార్టీ నేతలు చెప్పినట్టే ఇప్పుడు అవతలి నుంచి రియాక్షన్లు వస్తున్నాయి. ఆ మేనిఫెస్టో తమని చూసి కాపీ కొట్టారంటున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తమ మేనిఫెస్టోలోని అంశాలనే సీఎం కేసీఆర్ ప్రస్తావించారన్నారు. కాకపోతే ప్రతి పథకానికి ఓ వెయ్యిరూపాయలు జోడించారని ఎద్దేవా చేశారు.

51మందికే బీఫామ్ లు.. ఇదెక్కడి లాజిక్..

115మంది అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ 51మందికి మాత్రమే ఎందుకు బీ ఫామ్ లు ఇచ్చారంటూ లాజిక్ తీశారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించగానే బీఆర్ఎస్ కు భయం మొదలైందన్నారు. ఆరు గ్యారెంటీలు చూసి వారు వణికిపోయారని, ఇప్పుడు వాటినే కాపీ కొట్టారని సెటైర్లు పేలుస్తున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కావు అని విమర్శించినవారు, ఇప్పుడు వాటినే ఎందుకు మేనిఫెస్టోలో పెట్టారని ప్రశ్నించారు. మొత్తమ్మీద బీఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్ లో కలవరం రేపిందని ఈ రియాక్షన్ తో స్పష్టమవుతోంది.

ప్రమాణం చేస్తా..

నోటుకు సీటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి, భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణం చేయాలంటూ చాలామంది ఇటీవల సవాళ్లు విసిరిన సంగతి తెలిసిందే. అయితే ఆ సవాళ్ల విషయంపై ఆయన స్పందించలేదు కానీ కొత్తగా తానే ఓ సవాల్ ని తెరపైకి తెచ్చారు. ఎన్నికల్లో ఓటర్లకు చుక్క మందు పోయకుండా, డబ్బులు పంచకుండా కొట్లాడుదామంటూ సవాల్ విసిరారు. ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం అమర వీరుల స్థూపం వద్ద.. ఈ సవాల్ మేరకు తాను ప్రమాణం చేస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. డబ్బు, మద్యం పంపిణీ చేయబోదని ప్రమాణం చేస్తానని.. బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చి ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు.

First Published:  15 Oct 2023 6:00 PM IST
Next Story