Telugu Global
Telangana

హమ్మయ్య మేం సేఫ్.. బీఆర్ఎస్ లిస్ట్ పై రేవంత్ స్పందన

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో దోస్తానా చేసుకుని.. ఇప్పుడు కరివేపాకుల్లా కమ్యూనిస్టు పార్టీలను పక్కన పారేశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. మోసపోయిన కమ్యూనిస్ట్ లు తిరుగుబాటు చేయాలన్నారు.

హమ్మయ్య మేం సేఫ్.. బీఆర్ఎస్ లిస్ట్ పై రేవంత్ స్పందన
X

బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాస్త వెటకారంగా స్పందించారు. ఇక తమ పని సులువు అవుతుందన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా చూసి కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని ప్రజల్లో నమ్మకం ఏర్పడిందన్నారు. తెలంగాణలో తమ గెలుపు నల్లేరుపై నడకేనన్నారు రేవంత్ రెడ్డి.

మహిళల సంగతేంటి..?

బీఆర్ఎస్ తొలి జాబితాలో మహిళలకు తక్కువ ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు రేవంత్ రెడ్డి. మహిళల టికెట్ల విషయంలో ఎమ్మెల్సీ కవిత స్పందించాలన్నారు. సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయడంపై కూడా రేవంత్ స్పందించారు. బీఆర్ఎస్ జాబితా చూస్తే ఆ పార్టీలో ఓటమి భయం ఉందని స్పష్టమవుతోందన్నారు.

కమ్యూనిస్ట్ లు కరివేపాకులా..?

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో దోస్తానా చేసుకుని.. ఇప్పుడు కరివేపాకుల్లా కమ్యూనిస్టు పార్టీలను పక్కన పారేశారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. మోసపోయిన కమ్యూనిస్ట్ లు తిరుగుబాటు చేయాలన్నారు. పరోక్షంగా కమ్యూనిస్ట్ లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి.

ఎక్కడినుంచైనా పోటీకి రెడీ..

పార్టీ ఆదేశిస్తే, కార్యకర్తలు కోరితే.. తాను ఎక్కడినుంచైనా పోటీ చేస్తానన్నారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు, మద్యం పంచబోమంటూ యాదాద్రిలో కానీ, నాంపల్లి దర్గాలో కానీ, మెదక్ చర్చిలో కానీ ప్రమాణం చేయడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయంలోనే తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి చేశామని చెప్పిన రేవంత్.. గత 50 ఏళ్లలో కాంగ్రెస్, తెలంగాణకు ఏం చేసిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

First Published:  21 Aug 2023 6:13 PM IST
Next Story