Telugu Global
Telangana

ఈ రోజు నుంచే విజయోత్సవాలు చేసుకుందాం..

ఇకపై తమ నుంచి పదునైన భాష ఉండదని, అలాంటి మాటలు కూడా మీడియా ఆశించొద్దని అన్నారు. ప్రజలు తమపై బరువు, బాధ్యత పెట్టారని.. తాము ఇక నుంచి మరింత బాధ్యతాయుతంగా ఉంటామన్నారు రేవంత్ రెడ్డి.

ఈ రోజు నుంచే విజయోత్సవాలు చేసుకుందాం..
X

కాంగ్రెస్ శ్రేణులు డిసెంబర్ 3 వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, ఈ రోజు నుంచే విజయోత్సవాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. బాధ్యతాయుతంగా విజయోత్సవాలు చేసుకోవాలని, గెలిచినవారు రాజులు, ఓడినవారు బానిసలు కాదని.. ప్రజాస్వామ్యంలో అధికార, ప్రతిపక్షాలు రెండూ కలసి ప్రయాణించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవిస్తామని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడే అవకాశమిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి.


సోనియా గాంధీ ఇచ్చే ఆరు గ్యారెంటీలతోపాటు, కాంగ్రెస్ పార్టీ మరో గ్యారెంటీ ఇచ్చిందని, ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో పునరుద్ధరిస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛనిస్తామని, సామాజిక న్యాయం చేస్తామని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడుగా తాను ఈ హామీ ఇస్తున్నానని అన్నారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి తమ కర్తవ్యం అని చెప్పారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ తనదైన అభివృద్ధి నమూనాని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

మీడియాకి కూడా ఈ రోజు నుంచి స్వేచ్ఛ లభించినట్టేనని చెప్పారు రేవంత్ రెడ్డి. ప్రజా సమస్యలను ప్రతిబింబించే విధంగా ఈ రోజునుంచి మీడియా ప్రవర్తించొచ్చని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి మీదా ఆధిపత్యం చలాయించదని, ఎవరినీ నిర్భందించదని, ఇబ్బంది పెట్టదని హామీ ఇచ్చారు. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతాయుతంగా ప్రజా సమస్యల పరిష్కారానికే వినియోగిస్తామన్నారు. తాము పాలకులం కాదని, సేవకులం అన్నారు రేవంత్ రెడ్డి.

సీడబ్య్యూసీ ఆదేశాల మేరకు, సీఎల్పీ సమావేశం నిర్ణయించి లాంఛనంగా ప్రమాణ స్వీకార తేదీ నిర్ణయించి ముందుకెళ్తామని చెప్పారు రేవంత్ రెడ్డి. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో అమరవీరుల సంక్షేమం కోసం తాము కృషి చేస్తామని చెప్పారు. ఇకపై తమ నుంచి పదునైన భాష ఉండదని, అలాంటి మాటలు కూడా మీడియా ఆశించొద్దని అన్నారు. ప్రజలు తమపై బరువు, బాధ్యత పెట్టారని.. తాము ఇక నుంచి మరింత బాధ్యతాయుతంగా ఉంటామన్నారు రేవంత్ రెడ్డి.


First Published:  30 Nov 2023 6:53 PM IST
Next Story