Telugu Global
Telangana

ఈ సారి దక్షిణాది నుంచే ప్రధాని - రేవంత్ రెడ్డి

ఇండియా టీవీ-లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్‌ రెడ్డి.. బీజేపీ 400 సీట్లు గెలవాలంటే పాకిస్థాన్‌లోనూ గెలవాల్సి ఉంటుందని సెటైర్లు వేశారు.

ఈ సారి దక్షిణాది నుంచే ప్రధాని - రేవంత్ రెడ్డి
X

బీజేపీ ఈ సారి 400 సీట్లు కాదు... 300 ఎంపీ సీట్లు గెలవడం కష్టమేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇండియా టీవీ-లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్‌ రెడ్డి.. బీజేపీ 400 సీట్లు గెలవాలంటే పాకిస్థాన్‌లోనూ గెలవాల్సి ఉంటుందని సెటైర్లు వేశారు.

2019 ఎన్నికల్లో బిహార్, యూపీ, గుజరాత్‌, రాజస్థాన్‌, కర్ణాటక, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో 90 శాతానికిపైగా ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకుందని..అయినప్పటికీ 300 సీట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఈ సారి ఆ పరిస్థితి ఉండదన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 4 ఎంపీ సీట్లు వచ్చాయన్న రేవంత్ రెడ్డి.. ఈ సారి రెండు సీట్లు వస్తాయన్నారు. బీజేపీకి ఈ సారి 214 నుంచి 240 సీట్లు మాత్రమే వస్తాయన్నారు. 400 సీట్లు వస్తాయని చెప్పుకొవడానికే బాగుంటుందన్నారు. కేసీఆర్ సైతం తనకు 100 సీట్లు వస్తాయని చెప్పారని..కానీ 39 మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు.

రాబోయే రోజుల్లో దక్షిణాది నుంచే ప్రధాని ఉంటారని చెప్పారు రేవంత్. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే, AICC సెక్రటరీ KC వేణుగోపాల్, రాహుల్ గాంధీ దక్షిణాది నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ దక్షిణాది వారి చేతిలో చిక్కుకుందన్న విమర్శలను రేవంత్ తిప్పికొట్టారు. కేంద్ర ప్రభుత్వంలో యూపీ, గుజరాత్‌ వాళ్లకే పెద్దపీట వేస్తున్నారని, దక్షిణాదిని చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు.

First Published:  14 April 2024 9:06 AM IST
Next Story