మరీ ఇంత ఓవరాక్షనా..?
పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మిస్తామని చెప్పటానికి రేవంత్ ఎవరసలు..? ఏపీకి రేవంత్ కు ఏమిటి సంబంధం..? తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన రేవంతే ఏపీ బాధ్యతలు కూడా చూస్తున్నారా..?
కొన్నిసార్లు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్ళిన రేవంత్ అక్కడ మాట్లాడిన మాటలు అలాగే అనిపిస్తోంది. ఇంతకీ ఆయనేమన్నారంటే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిని నిర్మించేది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. ఇటు పోలవరం ప్రాజెక్టును అటు అమరావతి రాజధానిని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని రేవంత్ స్పష్టంగా ప్రకటించారు.
ఇక్కడే రేవంత్ ఓవరాక్షన్ బయటపడింది. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మిస్తామని చెప్పటానికి రేవంత్ ఎవరసలు..? ఏపీకి రేవంత్ కు ఏమిటి సంబంధం..? తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన రేవంతే ఏపీ బాధ్యతలు కూడా చూస్తున్నారా..? రేవంత్ ప్రకటన చూసిన తర్వాత చంద్రబాబునాయుడు తరపున ప్రకటించినట్లే ఉంది. పోలవరం ప్రాజెక్టు సంగతిని పక్కనపెట్టేస్తే చంద్రబాబు మనసంతా అమరావతి రాజధాని మీదే ఉంది.
నిజానికి ఇపుడున్న పరిస్ధితుల్లో చంద్రబాబు మళ్ళీ సీఎం అయినా అమరావతి నిర్మాణం సాధ్యంకాదు. మరి ఏ ఉద్దేశ్యంతో అమరావతి రాజధానిని నిర్మిస్తామని రేవంత్ ప్రకటించారో అర్ధంకావటంలేదు. తెలంగాణకు సంబంధించిన విషయాలకు మాత్రమే రేవంత్ పరిమితమయ్యుంటే బాగుండేది. తెలంగాణ పార్టీ వ్యవహారాల్లోనే రేవంత్ ఒకటిచెబితే ప్రత్యర్ధులు పదంటున్నారు. తెలంగాణ పార్టీలోనే సీనియర్లందరినీ ఏకతాటిపైకి తేలేక అలా వదిలేశారు. అలాంటిది ఏపీ వ్యవహారాల్లో వేలుపెట్టాల్సిన అవసరమే లేదు.
అయినా ప్రకటించారంటే ఏదో మనసులో పెట్టుకునే మాట్లాడినట్లున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చూస్తుంటే రేవంత్ కు టీడీపీ వాసనలు పోయినట్లు లేదు. ఇంకా తనకు బాస్ చంద్రబాబే అనుకుంటున్నట్లున్నారు. అందుకనే చంద్రబాబు+మద్దతుదారులను సంతోష పెట్టేందుకు పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం గురించి మాట్లాడినట్లుగా ఉంది. రైతులకు ఉచిత విద్యుత్ అవసరంలేదని, ములుగు ఎంఎల్ఏ సీతక్కను సీఎం చేస్తామని రేవంత్ చేసిన ప్రకటనపైనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి సీనియర్లు మండిపోతున్నారు. ఈ విషయాలు మాట్లాడేందుకు రేవంత్ అధికారాలు, అర్హతలు ఏమిటని కోమటిరెడ్డి నిలదీస్తున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో తెలంగాణా వ్యవహారాలు చూసుకోకుండా ఏపీ గురించి ఎందుకు ?