Telugu Global
Telangana

తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..

బీఆర్ఎస్ ఈరోజు నుంచి రైతు వేదికల వద్ద నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తీర్మానాలు చేయిస్తోంది. ఈ దశలో రేవంత్ రెడ్డి కూడా రైతులకు బహిరంగ లేఖ రాసి బీఆర్ఎస్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు.

తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
X

ఉచిత విద్యుత్ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి నష్టనివారణ చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ కూడా 24గంటల ఉచిత విద్యుత్ కి సిద్ధమేనని ప్రకటించిన ఆయన, నేరుగా సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి తిరిగి పోటీకి సిద్ధమా అని సవాళ్లు విసురుతున్నారు. దమ్ముంటే బీఆర్ఎస్ సిట్టింగ్ లకే టికెట్లు ఇవ్వాలని అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రైతాంగానికి బహిరంగ లేఖ రాశారు రేవంత్ రెడ్డి.

ఇక రుణమాఫీ ఉండదు..

తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది చివరి బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టేసినందున ఇక రైతులకు రుణమాఫీ చేయదనే విషయం స్పష్టమైందని తన లేఖలో పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. అర్హులైన 31 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయాల్సిన ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే, రైతులతో రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ బయలుదేరిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడంలేదని, ఉచిత విద్యుత్ 10గంటలు కూడా సక్రమంగా ఇవ్వడంలేదని అన్నారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, ధాన్యం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారనే విషయంపై బీఆర్ఎస్ నేతల్ని నిలదీయాలని రైతులకు ఉపదేశమిచ్చారు రేవంత్ రెడ్డి.

రైతుల దగ్గరే పంచాయితీ..

అటు బీఆర్ఎస్ ఈరోజు నుంచి రైతు వేదికల వద్ద నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తీర్మానాలు చేయిస్తోంది. ఈ దశలో రేవంత్ రెడ్డి కూడా రైతులకు బహిరంగ లేఖ రాసి బీఆర్ఎస్ ని టార్గెట్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ దే పైచేయి అన్నట్టు కనిపిస్తోంది. మూడు పంటల కేసీఆర్ ప్రభుత్వం కావాలా, మూడు గంటలు కరెంటు ఇస్తామంటున్న కాంగ్రెస్ కావాలా అనే విషయంలో రైతులు ఓ క్లారిటీకి వస్తున్నారు.

First Published:  17 July 2023 11:21 AM IST
Next Story