Telugu Global
Telangana

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. తరలి వచ్చిన అధిష్టానం

ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి ఓపెన్ టాప్ జీపులో సోనియాగాంధీతో కలసి వచ్చారు రేవంత్ రెడ్డి. స్టేడియం మొత్తం వాహనంలో కలియదిరుగుతూ.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. తరలి వచ్చిన అధిష్టానం
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన తర్వాత డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ప్రమాణం చేశారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది.


సోనియాతో కలసి వచ్చిన రేవంత్..

ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి ఓపెన్ టాప్ జీపులో సోనియాగాంధీతో కలసి వచ్చారు రేవంత్ రెడ్డి. స్టేడియం మొత్తం వాహనంలో కలియదిరుగుతూ.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. సోనియా తర్వాత.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్టేజ్ పైకి చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సహా.. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నేతలంతా స్టేజ్ పైకి చేరుకున్న అనంతరం గవర్నర్ తమిళిసై ప్రత్యేక వాహనంలో ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి వచ్చారు. ఆమెకు రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. స్టేజ్ పై ఉన్న కాంగ్రెస్ అధినాయకత్వాన్ని పట్టించుకోనట్టే గవర్నర్ తన సీటు వద్దకు వచ్చి ఆశీనులయ్యారు. అనంతరం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారిని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఆప్యాయంగా పలకరించారు. రేవంత్ రెడ్డి మనవడిని ముద్దాడారు.

First Published:  7 Dec 2023 1:38 PM IST
Next Story