Telugu Global
Telangana

పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ.. పార్లమెంట్ ఎన్నికలపై చర్చ

ఖర్గేతో భేటీ తర్వాత రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రధాని మోదీతో భేటీ గురించి సోనియా గాంధీకి వివరించారు.

పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ.. పార్లమెంట్ ఎన్నికలపై చర్చ
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలసి ప్రధాని మోదీతో సమావేశం అయిన అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని కలిశారు. ఆ తర్వాత సోనియాగాంధీతో కూడా రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల గురించి చర్చలు జరిగినట్టు సమాచారం. ఇదే ఉత్సాహంతో తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు సాధించాలని సోనియా గాంధీ, రేవంత్ కి ఉపదేశించినట్టు తెలుస్తోంది.

ఖర్గేతో భేటీ తర్వాత రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రధాని మోదీతో భేటీ గురించి సోనియా గాంధీకి వివరించారు. ఆరు గ్యారెంటీల అమలుపై కూడా ఆమె ఆరా తీసినట్టు తెలుస్తోంది.

గ్యారెంటీలు అమలైతేనే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినా మెజార్టీ విషయంలో మాత్రం కాస్త అసంతృప్తి ఉంది. లోక్ సభ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలనేది ఆ పార్టీ ఆలోచన. అదే సమయంలో ఆరు గ్యారెంటీల అమలు కూడా కత్తిమీద సాములా మారింది. ఆరు గ్యారెంటీలనేవి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశముంది.

లోక్ సభ ఎన్నికల లోగా.. ఆరు గ్యారెంటీలు అమలైతే, నిబంధనల విషయంలో ప్రజలు సంతృప్తిగా ఉంటేనే కాంగ్రెస్ కి ఓట్లు వేస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా, ప్రజల్లో అసంతృప్తి పెరిగినా కచ్చితంగా కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తారు. అందుకే బీఆర్ఎస్ కూడా వేచి చూసే ధోరణిలో ఉంది. తనకు తానే కాంగ్రెస్ తప్పులు చేసి, గ్యారెంటీల విషయంలో విమర్శలు మూటగట్టుకుంటే ఆ ప్రభావం కచ్చితంగా లోక్ సభ ఎన్నికలపై పడుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హైరానా పడుతోంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రాలు విడుదల చేస్తూనే.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు.. గ్యారెంటీగా అమలు చేస్తామని చెబుతున్నారు నేతలు.

First Published:  27 Dec 2023 8:06 AM IST
Next Story