Telugu Global
Telangana

లోక్ సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకం.. తెలంగాణ కాంగ్రెస్ మూడంచెల వ్యూహం

పార్టీ బూత్ లెవల్ కమిటీల్లో కార్యకర్తల పనితీరు బట్టి.. వారిని రాబోయే రోజుల్లో ఇందిరమ్మ కమిటీల్లో నియమిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

లోక్ సభ ఎన్నికలు ప్రతిష్టాత్మకం.. తెలంగాణ కాంగ్రెస్ మూడంచెల వ్యూహం
X

తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ కి లోక్ సభ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. 100 రోజుల పాలన బహుబాగు అంటూ ఇటీవలే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంది కాంగ్రెస్. లేదు లేదు మీ పాలనలో రైతులతో సహా అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డాయని విమర్శిస్తోంది ప్రతిపక్షం. ఇందులో ఏది నిజమో తేలాలంటే లోక్ సభ ఎన్నికలు జరగాలి. అంటే ఈ ఎన్నికల్లో కూడా తమ మెజార్టీ నిరూపించుకుంటే తమది ప్రజా పాలనేనని ప్రత్యేకంగా రుజువు చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కి లేదు. అందుకే లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ కసరత్తులు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ లో విపరీతమైన కాంపిటీషన్ ఉన్నా కూడా ఏరికోరి ఇతర పార్టీల నేతల్ని చేర్చుకుని టికెట్లు ఇస్తోంది. ఈ ప్రయోగం ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

టార్గెట్ 14 సీట్లు..

తెలంగాణలో ఉన్న లోక్ సభ సీట్లు 17. అందులో ఎంఐఎంకి హైదరాబాద్ స్థానం ఖాయమనే అభిప్రాయం ఉంది. నికరంగా మిగతా పార్టీలు మిగిలిన ఆ 16 సీట్లను పంచుకోవాలి. అయితే కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం ఖాయమంటోంది, బీజేపీ తమకు 12 స్థానాలు గ్యారెంటీ అంటోంది. బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు తమవేనంటోంది. ఈ లెక్కలు తేలాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. అయితే మిగతా పార్టీలకంటే కాంగ్రెస్ కి తెలంగాణలో లోక్ సభ సీట్లు కీలకంగా మారాయి. కేంద్రంలో అధికారంలోకి వచ్చినా రాకపోయినా తెలంగాణలో మాత్రం మెజార్టీ సీట్లు సాధిస్తేనే ఆపార్టీ పరువు దక్కుతుంది.

మూడంచెల వ్యూహం..

లోక్‌సభ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్‌ బూత్‌ స్థాయుల్లో మూడంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలు నియమించాలని పీసీసీ తాజాగా నిర్ణయించింది. లోక్‌సభ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఏఐసీసీ పరిశీలకులతోపాటు అక్కడి పార్టీ ముఖ్య నేతలు సభ్యులుగా ఉంటారు. ఇక అసెంబ్లీ స్థాయిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్యే లేనిచోట పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి లు ఈ కమిటీలో కీలకంగా ఉంటారు. మండలాలనుంచి ముఖ్య నేతలు సభ్యులుగా వ్యవహరిస్తారు. పోలింగ్‌ బూత్‌స్థాయి కమిటీలో ఐదుగురు చురుకైన కార్యకర్తలకు స్థానం ఉంటుంది. ఆయా కమిటీలకు సంబంధించి విధి విధానాలను సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశేం నిర్వహించిన ఆయన ఎన్నికలయ్యేంత వరకు రాష్ట్ర ముఖ్య నేతలందరూ కలిసికట్టుగా బాధ్యతలు పంచుకోవాలని, కార్యకర్తల వెన్నంటి ఉండాలని సూచించారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పార్టీ బూత్ లెవల్ కమిటీల్లో కార్యకర్తల పనితీరు బట్టి.. వారిని రాబోయే రోజుల్లో ఇందిరమ్మ కమిటీల్లో నియమిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

First Published:  23 March 2024 7:33 AM IST
Next Story