Telugu Global
Telangana

టీఆర్ఎస్ టు బీఆర్ఎస్.. మధ్యలో నేనున్నానంటున్న రేవంత్

టీఆర్ఎస్ పై ఢిల్లీ హైకోర్టులో తాను వేసిన పిటిషన్ ఇంకా విచారణలోనే ఉందని, దానిపై తీర్పు వచ్చే వరకు టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మారదంటూ లాజిక్ చెబుతున్నారు రేవంత్ రెడ్డి.

టీఆర్ఎస్ టు బీఆర్ఎస్.. మధ్యలో నేనున్నానంటున్న రేవంత్
X

టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చేందుకు ఆ పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఆ తీర్మానం కాపీని ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కి కూడా చేరవేశారు నేతలు. అయితే పార్టీ పేరు మార్పు వ్యవహారంలో కేవలం టీఆర్ఎస్ నేతల ఆమోదం సరిపోదని, మధ్యలో తాను కూడా ఉన్నానంటున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అసలు టీఆర్ఎస్ పేరు మార్పున‌కు రేవంత్ రెడ్డికి ఏంటి సంబంధం. ఆ పార్టీ పేరు మార్పున‌కు ఈ పార్టీ అధ్యక్షుడితో పనేంటి..? అని అనుకుంటున్నారా.. మీరే చదవండి.

రేవంత్ లాజిక్..

2018లో గులాబీ కూలీ పేరుతో టీఆర్ఎస్ పార్టీకోసం వందల కోట్ల రూపాయలు ఫండ్ వసూలు చేశారంటూ రేవంత్ రెడ్డి గతంలో ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ కి కూడా ఫిర్యాదు చేశారు. ఆ పిటిషన్ ఇంకా విచారణలోనే ఉందని, దానిపై తీర్పు వచ్చే వరకు టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మారదంటూ లాజిక్ చెబుతున్నారు రేవంత్ రెడ్డి. కోర్టు తీర్పు వస్తే టీఆర్ఎస్ గుర్తింపు కోల్పోతుందని, టీఆర్ఎస్సే లేనప్పుడు బీఆర్ఎస్ లేనే లేదని అంటున్నారు.

ఎన్నికలను బీజేపీ అసహ్యంగా మార్చేసిందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ నుంచి వస్తున్న కేంద్ర మంత్రులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో ఓటుకి 40వేల రూపాయల వరకు ఇస్తామంటూ టీఆర్‌ఎస్‌, బీజేపీ ఆఫర్లు ఇస్తున్నాయని చెప్పారు. మునుగోడులో విజయం కాంగ్రెస్ దేనని ధీమా వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. పార్టీ నాయకులంతా మునుగోడులో ప్రచారం నిర్వహిస్తారని, తమ అభ్యర్థి విజయానికి కృషి చేస్తారని చెప్పారు.

First Published:  9 Oct 2022 6:38 PM IST
Next Story