రేవంత్ రెడ్డి.. మీ గురువులకే చుక్కలు చూపించిన మహా వ్యక్తి కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత
తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకునేది లేదంటూ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి…ఒక వేగుచుక్క అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ మొక్క అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని ఆమె అన్నారు. కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత నేడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకునేది లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్.
గత బీఆర్ఎస్ పాలనలో నిధులు వరదలై పారేవి.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయి. బ్రిటీష్ పాలనలో కూడా లేని చేనేతపై లేని పన్నులు.. ప్రధాని మోదీ ప్రభుత్వంలో మాత్రం జీఎస్టీ రూపంలో విధించడం మన దౌర్భాగ్యం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియింబర్స్ చేయాలని కవిత డిమాండ్ చేశారు.