Telugu Global
Telangana

రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ ను ముంచుతున్నడు

ఆ పార్టీ కార్యకర్తలే ఆయన వీపు పగలగొట్టుడు ఖాయం

రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ ను ముంచుతున్నడు
X

కాంగ్రెస్‌ పార్టీని ఉపయోగించుకొని సీఎం అయిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీని ముంచుతున్నాడని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఆ పార్టీ కార్యకర్తలే రేవంత్‌ రెడ్డి వీపు పగలకొట్టడం ఖాయమని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం పథకం ప్రకారమే రైతులను మిల్లర్లు, దళారీలకు వదిలేశారని.. రైతులు నిండా మునిగిన తర్వాత ఏదో రివ్యూ చేసినట్టు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సీఎం, మంత్రులు మిల్లర్లతో కుమ్మక్కయ్యారని, రూ.వందల కోట్ల అవినీతి జరిగిందన్నారు. గత పదేళ్లలో రైతులు పండించిన ప్రతి గింజను కేసీఆర్‌ కొన్నారని గుర్తు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి రైతుల వద్ద ధాన్యం కొనకుండా అధికారులను బెదిరించారని అన్నారు. సదరు మంత్రే భారీ కుట్రకు తెరతీసి రైతులను నిండా ముంచారని అన్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందున్న దుర్భర పరిస్థితులే కాంగ్రెస్‌ పాలనలో మళ్లీ వచ్చాయన్నారు. ఇంతవరకు గింజ సన్నవడ్లను కూడా ప్రభుత్వం కొనలేదన్నారు. రైతులకు సమాధానం చెప్పడానికి అధికారులు భయ పడుతున్నారని అన్నారు. సమస్యలను పక్కదారి పట్టించడానికి సీఎం రేవంత్‌ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ను ప్రజలు మర్చిపోయారని అంటూనే.. ఆయనను చూసి సీఎం భయపడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ ను చూస్తే ఎందుకు వణుకు అని ప్రశ్నించారు. కొడంగల్‌ లో అధికారులపై రైతుల దాడి సీఎంపై జరిగిన దాడిగానే ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు. సొంత నియోజకవర్గంలోనే సీఎంపై ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు.

కేసీఆర్‌ ను రేవంత్‌ రెడ్డి నోటికి వచ్చినట్టు తిడుతూ టైం పాస్‌ చేస్తున్నారని మండిపడ్డారు. చెడ్డపేరు తెచ్చుకొని చరిత్రలో నిలిచిపోవాలని రేవంత్‌ చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై దాడి జరగలేదని వికారాబాద్‌ కలెక్టర్‌ చెప్తుంటే, రైతులపై ఎందుకు కేసులు పెడుతున్నారో చెప్పాలన్నారు. మేధావులు ఒకసారి కొడంగల్‌ కు వెళ్లి అక్కడం ఏం జరుగుతుందో చూసి రావాలన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలో అధికారులను అడ్డుకోవాలని బీఆర్‌ఎస్‌ పిపులునివ్వలేదన్నారు. కొడంగల్‌ ఘటన వెనుక బీఆర్‌ఎస్‌ కుట్ర ఉందని కాంగ్రెస్‌ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రేవంత్‌ రెడ్డి 25 సార్లు ఢిల్లీకి వెళ్లి ఎవరి కాళ్లు మొక్కారో ప్రజలకు తెలుసు అన్నారు. ఉదయం రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రాత్రి మోదీ, అమిత్ షా కాళ్లు రేవంత్ రెడ్డి పట్టుకుంటున్నారని తెలిపారు. కేటీఆర్‌ ఢిల్లీలో ఏం చేశారు, ఎందరిని కలిశారో తెలుసుకోవడానికి ప్రభుత్వానికి ఇంటెలెజిన్స్‌ ఉంది కదా అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ మైత్రి బండారం బయట పెట్టడానికే కేటీఆర్‌ ఢిల్లీకి వెళ్లారన్నారు. రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లడానికి రూ.300 కోట్లు ఖర్చు పెట్టాడని.. ఆ 300 కోట్లే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఖర్చు పెడుతుందన్నారు. రేవంత్‌ రెడ్డికి చెప్పే పరిస్థితిలో కాంగ్రెస్‌ సీనియర్లు లేరన్నారు. ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌ కు తెలియదా అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎవిడెన్స్‌ కోసం బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇచ్చారని వాళ్లు వెళ్లి సమాధానం చెప్తారన్నారు. మహారాష్ట్రలో ఎవరూ గెలిచినా తమకు వచ్చేదేమి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మంత్రిపై ఈడీ రెయిడ్స్‌ జరిగినా వాటి సమాచారం ఎందుకు బయట పెట్టలేదో చెప్పాలన్నారు.

First Published:  12 Nov 2024 4:54 PM IST
Next Story