మునుగోడులో పాదయాత్రకు రేవంత్ సహా సీనియర్లందరూ దూరం
మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ లో మరింత రచ్చకు దారితీస్తోంది. ఈ రోజు మునుగోడులో ప్రారంభమైన పాదయాత్రకు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో సహా సీనియర్లెవరూ హాజరుకాకపోవడం గమనార్హం.
మునుగోడు రాజకీయంలో ట్విస్ట్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించదలచిన పాదయాత్రలో పాల్గొనడం లేదు. కరోనా లక్షణాలతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లడంతో ఈ యాత్రకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అద్దంకి దయాకర్, కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎపిసోడ్ లో దయాకర్ తరఫున వెంకటరెడ్డికి తాను క్షమాపణ చెప్పినప్పటికీ వెంకటరెడ్డి శాంతించకపోవడం, దయాకర్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పట్టుబట్టడం వంటి పరిణామాలేమైనా రేవంత్ ని బాధించాయా అన్నది తేలడం లేదు. పైగా స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కూడా కనబడడంతో ఆయన ఇక యాత్ర యోచనను విరమించుకున్నారు. ఆయన నుంచి డాక్టర్లు శాంపిల్స్ సేకరించారు. రేవంత్ అనారోగ్యం దృష్ట్యా స్థానిక నేతలతో కలిసి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేదా జానారెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించవచ్చునని భావించారు అయితే రాంరెడ్డి దామోదర్ రెడ్డి తప్ప సీనియర్ నాయకులెవ్వరూ పాదయాత్రలో పాల్గొనకపోవడం గమనార్హం. నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు సుమారు 13 కి.మీ. దూరం ఈ యాత్ర సాగవలసి ఉంది.
నేను వినలేదు..చూడలేదు వెంకటరెడ్డి
అద్దంకి దయాకర్ తరఫున రేవంత్ రెడ్డి తనకు క్షమాపణ చెప్పడాన్ని తాను చూడలేదు.. వినలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుండబద్దలు కొట్టారు. రేవంత్ వ్యాఖ్యలు తనకు మీడియా ద్వారానే తెలిసిందన్నారు. నిజానికి రేవంత్ తన ట్విటర్ లోను ఆయనకు అపాలజీ చెప్పారు. అసలు పాదయాత్రలో పాల్గొనే ఆలోచన తనకు లేదని వెంకటరెడ్డి ఇదివరకే ప్రకటించారు. అయితే వెంకటరెడ్డికి తాను నచ్చజెబుతానని, పార్టీ అంతర్గత సమావేశంలో ఈ వ్యవహారంపై చర్చిస్తామని సీనియర్ నేత వీ.హెచ్. తెలిపారు. వెంకట రెడ్డి పార్టీ నుంచి బయటకు పోకుండా చూస్తామని ఆయన చెప్పారు. ఇదే సమయంలో మరో నేత దామోదర్ రెడ్డి రంగంలోకి దిగారు. స్టార్ కాంపెయినర్ అయిన వెంకటరెడ్డి అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని, ఆయన పిలవని పేరంటం కాదని వ్యాఖ్యానించారు.