బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్న రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంటే అగ్రవర్ణాలకు మాత్రమేనా? అని ప్రశ్న

సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కులగణన తప్పుల తడక అని తగలబెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తల ఎత్తుకునేలా కులగణన జరగాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించాను. అందుకే నన్ను సస్పెండ్ చేయాలని చాలారోజుల నుంచి అనుకుంటున్నాడు అని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఒక న్యాయం.. రాజగోపాల్‌రెడ్డికి ఒక న్యాయం.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంటే అగ్రవర్ణాలకు మాత్రమేనా? అని నిలదీశారు. పార్టీలో బీసీ హక్కుల గురించి మాట్లాడుతున్న బీసీ నాయకులకు షోకాజ్ నోటీసులు ఇస్తారు. అదే అగ్రవర్ణం వారు మాట్లాడితే మాత్రం వారిపై ఎలాంటి చర్యలు ఉండవన్నారు.
సీఎం రేవంత్ కావాలనే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు. కరీంనగర్ వెళ్లే సమయంలోనూ నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నేతలకు గట్టి మద్దతు లభించిందని, భవిష్యత్తులో మరింత బలంగా పోరాడుతామన్నారు. నన్ను సస్పెండ్ చేయడం ద్వారా బీసీలు ప్రశ్నించరనే భ్రమ నుంచి రేవంత్ రెడ్డి బైటికి రావాలన్నారు.కులగనన తప్పు అని పత్రాలు తగలబెడితే సస్పెండ్ చేస్తారా? కుటుంబసర్వేను కేసీఆర్ పకడ్బందీగా నిర్వహించారు. చివరిరోజున రేవంత్ రెడ్డి కులగణన చేయించుకున్నారు. దీన్నిబట్టి కులగణన పై ఆయన చిత్తశుద్ధి ఏమిటో అర్థమౌతుందన్నారు. బీసీలను తక్కువ చూపెట్టారు. కులగణన తప్పు అని నేను చెప్పింది నిజం కాకకపోతే మళ్లీ రీసర్వే ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసమే బీసీ జనాభా తగ్గించారు. 90 ఏళ్ల తర్వాత సర్వే చేసినా .. ఒక్కరూ చప్పట్లు కొట్టలేదన్నారు. రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా కులగణన చేస్తారనే హమీ ఇచ్చారనే కారణంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరాను. రేవంత్‌రెడ్డిపై నమ్మకంతో కాదన్నారు. సీఎం పేరును మంత్రులు కూడా సరిగా పలకడం లేదన్నారు.
సీఎం రేవంత్ బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నారు. ఏడాదిలోఏ ప్రభుత్వం ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, చెవెళ్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు. వంశీ చంద్‌రెడ్డి అధిష్టానికి దగ్గరగా ఉంటాడని, ఇక్కడి విషయాలు ఎప్పటికప్పుడు అక్కడికి చేరవేస్తాడనే ఉద్దేశంతోనే ఆయనను ఓడించింది రేవంత్ అని ఆరోపించారు.పార్టీ నేతలు మాట వినడం లేదని రేవంత్ రెడ్డి అలిగిపోతున్నారట. ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్‌ను ఓడిస్తున్నాడు. 2028లో తెలంగాణకు బీసీనే సీఎం అవుతాడు. పిల్లి గాండ్రింపులకు భయపడేది లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.