చంద్రబాబుకోసం ఐటీ నిరసనలు.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు కోసం నిరసన తెలిపే వాళ్లంతా ఇక్కడి ఓటర్లేననే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. నిరసనకారులను నియంత్రించడంలో అర్థం లేదన్నారు.
చంద్రబాబుకోసం హైదరాబాద్ లో నిరసనలు చేయాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. కావాలంటే రాజమండ్రిలో చేసుకోవాలని, హైదరాబాద్ కి సంబంధం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఐటీ యాక్టివిటీ దెబ్బతినకూడదని, శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదనే ఉద్దేశంతోటే నిరసనలకు అనుమతి ఇవ్వలేదన్నారు కేటీఆర్. అయితే ఇదే విషయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసన తెలిపితే తప్పేంటని అన్నారు. చంద్రబాబు దేశ నాయకుడని చెప్పారు రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని అన్నారు రేవంత్ రెడ్డి. ఏపీకి సంబంధించిన అంశాలపై ఇక్కడ నిరసన జరపొద్దని అంటే ఎలా అని ప్రశ్నించారు. నిరసనలు వద్దంటూ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రబాబుకోసం చేపట్టిన నిరసనలకు రేవంత్ రెడ్డి పరోక్ష మద్దతు తెలిపారు.
ఇక్కడి ఓటర్లే గుర్తు పెట్టుకోండి..
చంద్రబాబు కోసం నిరసన తెలిపే వాళ్లంతా ఇక్కడి ఓటర్లేననే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. నిరసనకారులను నియంత్రించడంలో అర్థం లేదన్నారు. నిరసన తెలిపే హక్కును ఎవరూ కాలరాయలేరని, ఏ పార్టీ వారికైనా ఆ హక్కు ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అమెరికాలో కూడా నిరసనలు జరిగాయని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. ప్రతి సమస్యకు ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేస్తుంటారని, మిగతా పార్టీలకు, నాయకులకు ఏ హక్కు ఉందని, ఢిల్లీలో నిరసనలు తెలియజేస్తారని ప్రశ్నించారు.
ఇప్పటికే రేవంత్ రెడ్డిని, చంద్రబాబు ఏజెంట్ అని.. తెలంగాణలో చంద్రబాబు కాంగ్రెస్ ఉందని.. బీఆర్ఎస్ కామెంట్లు చేస్తుంటుంది. ఇప్పుడు చంద్రబాబుకి సపోర్ట్ గా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు మొదల్యయే అవకాశముంది.