Telugu Global
Telangana

మోదీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

జాతీయ స్థాయిలో 9 బీజేపీయేతర ప్రభుత్వాలు ఏర్పడితే వాటిని చీల్చి తిరిగి బీజేపీ ఆయా రాష్ట్రాల్లో గద్దెనెక్కిందని, ఈ దుర్మార్గాలకు కాలం చెల్లిందని అన్నారు రేవంత్ రెడ్డి.

మోదీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్
X

చాలా రోజుల తర్వాత ప్రధాని మోదీకి సాలిడ్ ఓటమి ఎదురైందని, ఆయనకు బ్యాడ్ టైమ్ మొదలైనట్టేనని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేపీసీసీ సమావేశంలో పాల్గొనేందుకు బెంగళూరు వెళ్లారు రేవంత్ రెడ్డి. కర్నాటక విజయం కాంగ్రెస్ కి మరింత బలాన్ని చేకూర్చిందని చెప్పారు. ఈ విజయాన్ని తెలంగాణ ఎన్నికల్లోనూ రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఖర్గే హయాంలో హ్యాట్రిక్ కొడతాం..

మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడైన తర్వాత మొన్న హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గెలిచిందని, నిన్న కర్నాటకలో గెలిచామని, రేపు తెలంగాణలో కూడా గెలవబోతున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఖర్గేకి తెలంగాణ హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందన్నారు. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లోను ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయని, మోదీకి గుణపాఠం చెప్పక తప్పదన్నారు రేవంత్ రెడ్డి.

చీలికలే వారి బలం..

జాతీయ స్థాయిలో 9 బీజేపీయేతర ప్రభుత్వాలు ఏర్పడితే వాటిని చీల్చి తిరిగి బీజేపీ ఆయా రాష్ట్రాల్లో గద్దెనెక్కిందని, ఈ దుర్మార్గాలకు కాలం చెల్లిందని అన్నారు రేవంత్ రెడ్డి. ఫిరాయింపుల మీద పార్టీలను చీల్చడం ఇక బీజేపీకి సాధ్యం కాదన్నారు. గతంలో జై శ్రీరామ్ నినాదంతో పార్టీని విస్తరించే ప్రయత్నం చేసిందని, ఇప్పుడు రాముడ్ని వదిలేసి హనుమంతుని నినాదం అందుకుందని.. ఈ ఎన్నికల్లో హనుమంతుడు కూడా వారికి సహకరించలేదన్నారు. రాముడిని మోసం చేసిన వ్యక్తులకు హనుమంతుడు ఎలా సహకరిస్తాడని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

పాల్, సంజయ్.. ఇద్దరూ ఒకటే..

తెలంగాణలో కేఏ పాల్ మాట్లాడినా, బండి సంజయ్ మాట్లాడినా పెద్దగా తేడా ఏమీ ఉండదన్నారు రేవంత్ రెడ్డి. వాళ్లు మాట్లాడే మాటలను ఎలా అర్థం చేసుకోవాలో ప్రజలకు బాగా తెలుసన్నారు. కర్నాటకలో ఉన్న ప్రభుత్వాన్నే నిలబెట్టుకోలేకపోయిన బీజేపీ, తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. దక్షిణ భారత దేశంలో బీజేపీకి స్థానం లేదన్నారు. సౌత్ లో ఇక ఎక్కడ ఎన్నికలు జరిగినా భవిష్యత్తులో బీజేపీ గెలిచే అవకాశాలు లేవన్నారు రేవంత్ రెడ్డి.

First Published:  14 May 2023 4:39 PM IST
Next Story