రైతుబిడ్డ సీఎం అయితే ఓర్వలేరా..? రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, పేదల ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనీయం అని మాట్లాడటం న్యాయమా..? ధర్మమా..? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.
రైతుబిడ్డ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి. పాలమూరు పేదబిడ్డ ఈ రాష్ట్రాన్ని పాలించకూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదని, తమ జోలికొస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. పాలమూరు వాళ్లను ముట్టుకుంటే మానవ బాంబులం అవుతామంటూ మండిపడ్డారు. పాలమూరు న్యాయయాత్ర ముగింపు సందర్భంగా మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా దీవెన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు.
Hon’ble CM Sri. A.Revanth Reddy will participate in Palamuru Praja Deevena Sabha @ Mahabubnagar https://t.co/sxkUjqLHtv
— Telangana Congress (@INCTelangana) March 6, 2024
రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం, పేదల ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనీయం అని మాట్లాడటం న్యాయమా..? ధర్మమా..? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. 40 శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామని అనడం ప్రజాస్వామ్యానికి, దేశానికి మంచిది కాదన్నారు. విజ్ఞులు, మేధావులు ఈ విషయంపై ఆలోచించాలని చెప్పారు. "మా ప్రభుత్వాన్ని ఎందుకు పడగొడతామంటున్నారు? పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి జాతి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. దుర్మార్గమైన రాజకీయాలను పాతరేయాలని ప్రజలకు సూచించారు.
రాహుల్ ప్రధాని కావాలి..
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలని అన్నారాయన. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ గడ్డమీద కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
90రోజుల్లో ఏమేం చేశామంటే..?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి గురువారంతో 90 రోజులు పూర్తవుతుందని, దీన్ని రెఫరెండంగా తీసుకుందామని చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ 90 రోజుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీ నెరవేర్చామని, ఆరోగ్యశ్రీ పరిమితి పెంచామని, ఉచిత కరెంటు, వంట గ్యాస్ రాయితీ అందిస్తున్నామని, ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని వివరించారాయన. రైతుభరోసా కింద నిధులు జమ చేశామని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని, మహాలక్ష్మి గ్రూపులకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వబోతున్నామని, 11వేల పోస్టులతో మెగా డీఎస్సీ, 563 పోస్టులతో గ్రూపు 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు రేవంత్ రెడ్డి.