మతచిచ్చు మంచిది కాదు.. మోదీపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
దేవుడు గుడిలో.. భక్తి గుండెల్లో ఉండాలన్నారు. తాను హిందువుగా గర్విస్తానని, ముఖ్యమంత్రిగా ఇతర మతాలను గౌరవిస్తానన్నారు రేవంత్ రెడ్డి.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల మధ్య మత చిచ్చుపెట్టి ఓట్లు రాబట్టుకోడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మోదీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆయన అశాంతిని ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం దేశానికి మంచిది కాదన్నారు.
రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ కాంగ్రెస్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ గెలిస్తే దేశసంపదనంతా ముస్లింలకు పంచుతుందని ఆయన ఆరోపించారు. ఆ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం సరికాదన్నారు. అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలన్నా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని, అక్రమంగా ఎవరైనా ఆస్తులు రాయించుకుంటే శిక్షించేందుకు చట్టాలున్నాయని చెప్పారు. ఓ వర్గం ఆస్తిని ఇతర వర్గాల వారికి ఎలా పంచుతారని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు రేవంత్ రెడ్డి.
ఓట్ల కోసం శ్రీరాముడిని రోడ్లపైకి తీసుకురావడం మోదీకే చెల్లిందని విమర్శించారు రేవంత్ రెడ్డి. రాముడు అందరికీ దేవుడని, తమ ఇంట్లోనూ ఆయనతో పాటు ఇతర దేవుళ్లను పూజిస్తామని చెప్పారు. దేవుడు గుడిలో.. భక్తి గుండెల్లో ఉండాలన్నారు. తాను హిందువుగా గర్విస్తానని, ముఖ్యమంత్రిగా ఇతర మతాలను గౌరవిస్తానన్నారు. మతం పేరిట విభజన రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పారు రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.