రైతు భరోసాలో కీలక మార్పులు.. వారికి ఆర్థికసాయం కట్..!
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా రైతుబంధు పథకం అమలు చేసింది. దీంతో సాగు చేయని భూములకు సైతం ఆర్థిక సాయం అందింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకానికి కొనసాగింపుగా కాంగ్రెస్ తీసుకువచ్చిన రైతు భరోసా స్కీమ్‌లో కీలకమార్పులు చేసేందుకు సర్కార్ రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ముఖ్యంగా రెండు నిబంధనలు తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సాగు చేసే భూమికే రైతుబంధు ఇవ్వడం సహా రాష్ట్రంలో నివాసం ఉండే వారికే స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా రైతుబంధు పథకం అమలు చేసింది. దీంతో సాగు చేయని భూములకు సైతం ఆర్థిక సాయం అందింది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, రాళ్లు, రప్పలు, గుట్టలకు కేసీఆర్ సర్కార్ రైతు బంధు సాయం ఇస్తుందని గతంలో కాంగ్రెస్‌తో పాటు వివిధ పార్టీల నేతలు విమర్శలు చేశారు. సాగు చేసే భూమి ఎంతైనా ఆర్థిక సాయం అందించాలనేది ప్రస్తుత ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఎకరాలకు పరిమితి విధించి స్కీమ్ అమలు చేస్తే ఇన్నాళ్లూ సాయం పొందిన రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.
గతంలో భూమి ఉంటేచాలు ఓనర్ ఎక్కడున్నా.. రైతు బంధు సాయం ప్రభుత్వం అందించేది. ఇప్పుడు ఆ నిబంధనను కూడా మార్చనుంది ప్రభుత్వం. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి, ట్యాక్స్ కట్టే వారికి రైతు బంధు తొలగించాలన్న ప్రతిపాదనపైనా చర్చ సాగుతోంది. అతి త్వరలోనే ఈ అంశంపై కూడా నిబంధనలను విడుదల చేసే ఆలోచనలో ఉంది రేవంత్ సర్కార్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించగా.. ఏటా ఎకరాకు రూ.15 వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఈ సీజన్‌లో గతంలో మాదిరిగానే సాయం అందనుంది. వచ్చే సీజన్ నుంచి నిబంధనలతో రైతుభరోసా అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.