ఉచిత విద్యుత్ పై పేటెంట్ కాంగ్రెస్ దే -రేవంత్ రెడ్డి
తాను వేర్వేరుగా మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి ప్రజలను తప్పుదారి పట్టించారన్నారు రేవంత్ రెడ్డి. ఉచిత విద్యుత్ పై ప్రభుత్వ పెద్దలతో బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పారు.
రైతులకు ఉచిత విద్యుత్ పై పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అమెరికాలో తన మాటలను తెలంగాణలో కొంతమంది వక్రీకరించారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఉచిత్ విద్యుత్ ఫైలుపైనే పెట్టారని గుర్తు చేశారు. సాగుకు 9గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఉచిత విద్యుత్ తో పాటు రాయితీపై ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇచ్చామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత విద్యుత్ విషయంలో నష్టం జరగకుండా కాంగ్రెస్ అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుందని, వినియోగం ఆధారంగా తెలంగాణకే ఎక్కువ విద్యుత్ వచ్చేలా సోనియాగాంధీ చర్యలు తీసుకున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. అందుకే తెలంగాణకు 53శాతం, ఏపీకి 47 శాతం విద్యుత్ కేటాయింపులు జరిగాయని గుర్తు చేశారు.
అమెరికాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో.. ఆయన రెండు రోజుల ముందే అక్కడినుంచి బయలుదేరారు. హైదరాబాద్ లో తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. తాను వేర్వేరుగా మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి ప్రజలను తప్పుదారి పట్టించారన్నారు. ఉచిత విద్యుత్ పై ప్రభుత్వ పెద్దలతో బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్పారాయన. రైతులకు ఉచిత విద్యుత్ ను తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు రేవంత్ రెడ్డి.
రేవంత్ ఒంటరి అయ్యారా..?
ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన తర్వాత బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో నిరసనలు తెలిపింది. కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులు మళ్లీ కష్టాలు పడాల్సిందేనని ఆందోళనబాట పట్టారు బీఆర్ఎస్ నేతలు. ఊరూవాడా కాంగ్రెస్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి మాత్రమే. బీఆర్ఎస్ నిరసన పోరు రేవంత్ రెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్లెవరూ ఆయనకు మద్దతుగా మాట్లాడలేకపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి.. అందరూ సైలెంట్ గా ఉన్నారు. నోరు తెరిచిన కోమటి రెడ్డి, రేవంత్ కే కౌంటర్లిచ్చారు. పొన్నం ప్రభాకర్ వివరణలో కూడా రేవంత్ రెడ్డికి అనుకున్నంత సపోర్ట్ దక్కలేదు. చివరకు తనకోసం తానే ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకున్నారు టీపీసీసీ చీఫ్.