కేసీఆర్ కొడంగల్ రా.. లేకపోతే కామారెడ్డి వస్తా.. రేవంత్ సవాల్
దక్షిణ తెలంగాణలో పార్టీకి ఊపు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ తన సొంత నియోజవకర్గం గజ్వేల్‌తోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిని రెండో నియోజకవర్గంగా ఎంచుకున్నారు.
ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత ఎక్కడ పోటీ చేసినా అక్కడ ధీటైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని బీజేపీ, కాంగ్రెస్ సై అంటున్నాయి. ఇప్పటికే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీకి బీజేపీ నేత ఈటల రాజేందర్ సై అన్నారు. ఇకపోతే కేసీఆర్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డిలోనూ ఆయనకు గట్టి పోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అవసరమైతే తాను కామారెడ్డిలో పోటీ చేస్తానని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెబుతున్నారు.
కొడంగల్‌లో పోటీ చేయమని సవాల్
కేసీఆర్‌కు దమ్ముంటే తనపై కొడంగల్‌లో పోటీ చేయాలని రేవంత్ సవాల్ చేశారు. ఒకవేళ కేసీఆర్ కొడంగల్‌లో పోటీకి రాకపోతే తానే కామారెడ్డికి వెళతానని మరోమారు స్పష్టం చేశారు. కేటీఆర్, కేసీఆర్‌లను చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇది ఆత్మవిశ్వాసమా లేక ప్రజల్లో తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నమా అనేది తెలియని పరిస్థితి.
బీఆర్ఎస్ వ్యూహమేమిటో?
దక్షిణ తెలంగాణలో పార్టీకి ఊపు తెచ్చేందుకు సీఎం కేసీఆర్ తన సొంత నియోజవకర్గం గజ్వేల్‌తోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డిని రెండో నియోజకవర్గంగా ఎంచుకున్నారు. అక్కడ పోటీ చేస్తే పార్టీ శ్రేణులకు మరింత ఊపునిచ్చినట్లు అవుతుందన్నది గులాబీ బాస్ ఆలోచన. ఇక్కడ ఎప్పటి నుంచో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ.. కేసీఆర్‌పై పోటీ అనేసరికి వెనకడుగు వేస్తున్నారు. అందరూ సురక్షితమైన నియోజకవర్గాలు చూసుకుని తనను బలిపశువును చేస్తున్నారన్న ఆందోళన ఆయనలో ఉందని, అయినా కాంగ్రెస్ పెద్దలు ఆయన్ను బలవంతం చేసి ఒప్పించారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఒకవేళ రేవంత్ కామారెడ్డిలో కూడా పోటీ చేస్తే షబ్బీర్‌కు ఇప్పటికిప్పుడు వేరే నియోజకవర్గం చూడటం కూడా తలనొప్పి వ్యవహారమే మరి!