మోదీ, అమిత్ షాని కలసిన రేవంత్, భట్టి.. ఏమేం అడిగారంటే..?
ముఖ్యంగా విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం చొరవ చూపాలని కోరారు తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోరుతూ వారిద్దరికీ వినతి పత్రాలిచ్చారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలనే ఆలోచనతోనే ప్రధాని, హోం మంత్రిని కలిసినట్టు తెలిపారు రేవంత్, భట్టి. రాష్ట్ర అభివృద్ధి కోసం వారికి పలు వినతులు చేసినట్టు తెలిపారు. కేంద్రం వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించిందన్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ చొరవ తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
నేడు ఢిల్లీలో…
— Revanth Reddy (@revanth_anumula) July 4, 2024
ఉప ముఖ్యమంత్రి…
శ్రీ భట్టీ విక్రమార్క గారి తో కలిసి…
కేంద్ర హోంశాఖ మంత్రి…
శ్రీ అమిత్ షా గారిని కలవడం జరిగింది.
ఈ సందర్భంగా…
రాష్ట్రానికి సంబంధించిన…
పలు సమస్యల పరిష్కారం కోరుతూ…
వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
- తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TSNAB),… pic.twitter.com/kjyjhvcQkJ
ఇక హోంమంత్రి అమిత్ షా తో భేటీ కూడా సానుకూల ఫలితాలను ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం, డిప్యూటీ సీఎం. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TSNAB), తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TSCSB) ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని హోం మంత్రిని కోరినట్టు వారిద్దరు తెలిపారు. 2021 నుండి పెండింగ్ లో ఉన్న ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ అంశాన్ని తక్షణమే సమీక్షించాలని కూడా వారు అభ్యర్థించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితా నుంచి గతంలో తొలగించిన ఆదిలాబాద్, మంచిర్యాల, కొమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాలను తిరిగి సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్ పెండిచర్ రీఎంబర్స్ మెంట్ పథకం కింద కొనసాగించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సహా మరికొన్ని ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేయాలని కోరారు. నాలుగేళ్లుగా ఎస్పీవో (స్పెషల్ పోలీస్ ఆఫీసర్)లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 60 శాతం వాటా నిధులు పెండింగ్ లో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా అమిత్ షా కి గుర్తు చేశారు రేవంత్ రెడ్డి, భట్టి. ఆ పెండింగ్ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని కోరారు.
రీజినల్ రింగ్ రోడ్డుకు మొత్తంగా ఒకే జాతీయ రహదారి నెంబర్ ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలన్నారు. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంలో తెలంగాణ మార్చేందుకు కేంద్రం సహకారం ఇవ్వాలని, ఐపీఎస్ కేడర్ కింద 29 మందిని అదనంగా ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.
ముఖ్యంగా విభజన సమస్యల పరిష్కారంపై కేంద్రం చొరవ చూపాలని కోరారు తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగబోతున్న ఈ సమయంలో విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్రం కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నట్టు చెబుతున్నారు తెలంగాణ నేతలు.