Telugu Global
Telangana

బీఆర్ఎస్ విలీనం అంటూ మళ్లీ రచ్చ.. ఈసారి రేవంత్, బండి

బీఆర్ఎస్ కి నలుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారని, వారిని బీజేపీలో చేరిస్తే విలీనం పూర్తవుతుందని చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి బండి సంజయ్ విలీనం వార్తల్ని సైటెరిక్ గా సమర్థించారు.

బీఆర్ఎస్ విలీనం అంటూ మళ్లీ రచ్చ.. ఈసారి రేవంత్, బండి
X

ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ అధినేత బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ చిలక జోస్యం చెప్పారు. దానికి ఆయన ఓ లాజిక్ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈటల వంటి వారు ఈ విలీనాన్ని ఒప్పుకోవడం లేదని కూడా ఆయనే సెలవిచ్చారు. అప్పటికప్పుడు ఆ పుకార్లను తిప్పికొట్టారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు మళ్లీ అవే పుకార్లు మొదలు పెట్టారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. అయితే బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అవుతుందంటూ కాంగ్రెస్ నేతలు.. కాదు కాదు కాంగ్రెస్ లో విలీనం అవుతుందంటూ బీజేపీ నేతలు చెప్పడం ఇక్కడ విశేషం.

బీఆర్ఎస్ కి నలుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్నారని, వారిని బీజేపీలో చేరిస్తే విలీనం పూర్తవుతుందని చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అలా విలీనం చేస్తే కేసీఆర్‌కి గవర్నర్ పదవి, కేటీఆర్‌కి కేంద్రమంత్రి పదవి, కవితకు బెయిల్, హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తారని కూడా ఆయన జోస్యం చెప్పారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధుల చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలు ఊహాజనితం అన్నారు. అది కాంగ్రెస్‌ విషప్రచారమని మండిపడ్డారు ఈటల.

కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం విలీనం వార్తల్ని సైటెరిక్ గా సమర్థించారు. బీఆర్ఎస్ విలీనం బీజేపీలో కాదని, కాంగ్రెస్ లో అని చెప్పారు బండి. అలా విలీనం చేస్తే కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ, కవితకు రాజ్యసభ సీటు ఖాయమని అన్నారు. పొత్తు పెట్టుకొని పదువులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ది అని చెప్పారు బండి. కవిత బెయిల్‌కు, బీజేపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను విలీనం చేస్తే కవితకు బెయిల్‌ వస్తుందనడం మూర్ఖత్వం అని అన్నారు. కవిత బెయిల్‌ విషయంలో బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు బండి సంజయ్.



First Published:  16 Aug 2024 11:27 AM GMT
Next Story