నాపై కుట్ర చేస్తున్నారు.. కన్నీళ్లు పెట్టుకున్న రేవంత్ రెడ్డి
పీసీసీ చీఫ్‌గా ఉన్నందు వల్లే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందంటూ ప్రచారం చేయడానికి సొంత నాయకులు ఇతర పార్టీ నాయకులతో కలిసి కుట్ర చేస్తున్నారని రేవంత్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో తనను ఒంటరిని చేసి రాజకీయంగా దెబ్బ తీసేందుకు కుట్ర జరుగుతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనపై సొంత పార్టీ నేతలే కక్ష కట్టారని, పీసీసీ పదవి కోసం ఇలా చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్‌ను ఓడించి.. తనను టీపీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించాలనే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ గమనించాలని ఆయన కోరారు. ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డి గురువారం రాత్రి విలేకరులతో మాట్లాడారు.
నేను పీసీసీ చీఫ్‌గా ఉన్నందు వల్లే కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందంటూ ప్రచారం చేయడానికి సొంత నాయకులు ఇతర పార్టీ నాయకులతో కలిసి కుట్ర చేస్తున్నారని అన్నారు. అన్ని నిజాలు త్వరలోనే తెలుస్తాయని రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను అభిమానించే కార్యకర్తలకు మనసులో బాధను చెప్పాల్సి వస్తోంది. ఇది సోనియా గాంధీ ఇచ్చిన అవకాశం మాత్రమే. పదవులు ఎవరికీ శాశ్వతం కాదు, తన పీసీసీ అధ్యక్ష పదవి కూడా శాశ్వతం కాదని భావోద్వేగానికి గురయ్యారు. నేను పీసీసీ పదవి చేపట్టిన దగ్గర నుంచి టీఆర్ఎస్, బీజేపీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారని చెప్పారు.
కాంగ్రెస్ కార్యకర్తలందరూ స్వచ్చంధంగా మునుగోడు వచ్చి ప్రచారంచేయాలని, మన పార్టీని బతికించుకోవల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. భారత్ జోడో యాత్ర కూడా ఉన్నందున.. తాను అటు వైపు కూడా వెళ్లాల్సిన అవసరం ఉందని.. నేను ఉన్నా లేక పోయినా ఇక్కడకు వచ్చి నాయకులతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడకు వస్తే ఎవరో ఒకరు ఒక ముద్ద అన్నం పెడతారు, పడుకోవడానికి అరుగు మీద చోటిస్తారు. ఎవరూ భయపడకుండా వచ్చి ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. మునుగోడులో భారీగా పోలీసు బలగాలు వచ్చాయి. అయినా సరే నిర్భయంగా వచ్చి పాల్వాయి స్రవంతి గెలుపుకోసం కృషి చేయాలని ఆయన చెప్పారు.
టీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు కుట్ర చేస్తున్నాయి. ప్రజలను మద్యం పంచి, వారిని మత్తులో ఉంచి గెలవాలని ప్రణాళిక రచించాయి. ఇక్కడ డబ్బు ఏరులై పారుతోంది. కానీ ఓటర్లు ఇవన్నీ గమనించి కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పార్టీ చేస్తున్న దీక్షలు, పోరాటాలను గుర్తించాలని చెప్పారు.