Telugu Global
Telangana

అరెస్ట్ లను ఖండించిన రేవంత్

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగాయి. చివరి రోజు కాంగ్రెస్ హడావిడి చేయాలని ప్రయత్నించింది.

అరెస్ట్ లను ఖండించిన రేవంత్
X

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ.. కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. దశాబ్ది దగా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న, చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు పోలీసులు. కొందరిని హౌస్ అరెస్ట్ చేయగా, మరికొందర్ని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్ట్ లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అరెస్ట్ లతో ఉద్యమాన్ని ఆపలేరని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికం అని అన్నారు రేవంత్ రెడ్డి. దశాబ్ది ఉత్సవాల పేరుతో పార్టీకి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు కాంగ్రెస్ కి ఉందన్నారు రేవంత్. అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ నాయకుల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

అంత కడుపుమంట ఎందుకు..?

దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో 9 ఏళ్లుగా సంక్షేమ పాలన నడుస్తోందని, ఆ ప్రతిఫలాలు ప్రజలకు అందిన వేళ ఉత్సవాలు చేసుకుంటుంటే కాంగ్రెస్ నాయకులకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. దశాబ్ది దగా అంటూ కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజల్ని అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. మొత్తమ్మీద దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగాయి. చివరి రోజు కాంగ్రెస్ హడావిడి చేయాలని ప్రయత్నించింది. 21రోజులపాటు రోజుకొక ప్రత్యేక కార్యక్రమంతో తెలంగాణ దశాబ్ది విజయాలను ప్రజల కళ్లకు కట్టారు నేతలు, అధికారులు.

First Published:  22 Jun 2023 12:40 PM IST
Next Story