Telugu Global
Telangana

రేవంత్‌, మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు

బ్లాక్‌ లిస్టులో పెట్టాలన్న కంపెనీకి కాంట్రాక్టులు ఎలా కట్టబెడుతున్నరు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

రేవంత్‌, మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు
X

రేవంత్‌ రెడ్డి, మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మేఘా సంస్థను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ అన్న రేవంత్‌ రెడ్డి ఇప్పుడు అదే కంపెనీకి కాంట్రాక్టులు ఎలా కట్టబెడుతున్నాడని ప్రశ్నించారు. హైదరాబాద్‌ తాగునీటి కోసం సుంకిశాల ప్రాజెక్టు చేపట్టామని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్‌ మంత్రిగా ఉన్న రేవంత్‌ ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. మేఘా కంపెనీ క్రిమినల్ నెగ్లిజన్సీతోనే సుంకిశాలలో రీటైనింగ్‌ వాల్‌ కూలిపోయినట్టుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ నివేదిక ఇచ్చిందని, మేఘా సంస్థను బ్లాక్‌ లిస్టులో పెట్టాలని కూడా రికమండ్‌ చేసిందని గుర్తు చేశారు. రిటైనింగ్‌ వాల్‌ కూలిన ఘటనను సీఎం, ప్రభుత్వం బయటకు రాకుండా ఎందుకు దాచిపెట్టిందో చెప్పాలన్నారు. ఆ ప్రమాదంపై జ్యూడిషియల్‌ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ ఘటనను అడ్డం పెట్టుకొని కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు నీళ్లల్లో పోశారని ఆరోపణలు చేశారని.. సుంకిశాల ప్రమాదాన్ని మాత్రం బయటకు రానివ్వలేదన్నారు. సుంకిశాల ఘటనలో నలుగురు అధికారులను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. మేఘా సంస్థపై చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ నేత వివేక్‌ పత్రిక వెలుగులోనే కథనం ప్రచురించారని తెలిపారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు ప్రాజజెక్టులన్నీ మేఘా సంస్థకు, పొంగులేటి కంపెనీకి కట్టబెడుతున్నారని అన్నారు. కొడంగల్‌ లిఫ్ట్‌ స్కీం టెండర్లు రూ.4,350 కోట్లు మేఘాకు కట్టబెట్టారని ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌సీసీలను టెక్నికల్‌ బిడ్‌ లో డిస్‌ క్వాలిఫై చేసి మేఘా, పొంగులేటికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌ కు పనులు అప్పగించారని అన్నారు. మేఘాతో కుమ్మక్కై డబ్బులు దండుకోవడానికే ఈ కుట్రలని ఆరోపించారు. కొడంగల్‌ లిఫ్ట్‌ టెండర్లలో ఢిల్లీ వాటా ఎంతో చెప్పాలన్నారు. స్కిల్‌ యూనివర్సిటీకి రూ.200 కోట్ల విరాళం ఇచ్చినందుకే ప్రాజెక్టు పనులు అప్పగించారా అని ప్రశ్నించారు. కొండపోచమ్మసాగర్‌ నుంచి రూ.1,100 కోట్లతో మూసీకి నీళ్లిచ్చే అవకాశమున్నా, మల్లన్నసాగర్‌ నుంచి రూ.5,500 కోట్లతో పనులు చేస్తున్నారని.. మేఘాకే ఈ ప్రాజెక్టును కట్టబెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు.

రేవంత్‌ రెడ్డి చెప్పినట్టు ఐఏఎస్‌ అధికారులు, ఇంజనీర్లు సంతకాలు పెడితే తాము అధికారంలోకి వచ్చాక విచారణ ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేందుకు, ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు పైసలు లేవు కానీ మూసీ ప్రాజెక్టుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలన్నారు. మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ నుంచి మూటలు పోయాయని.. ఢిల్లీకి కూడా ఈస్ట్‌ ఇండియా కంపెనీ ద్వారానే మూటలు పంపిస్తున్నారని ఆరోపించారు. కేబినెట్‌ మంత్రిగా ఉన్న పొంగులేటి సంస్థకు పనులు ఎలా అప్పగిస్తారని..

ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందన్న విషయమన్న తెలుసా అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి సహాయ మంత్రి బండి సంజయ్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బామ్మర్ది సంస్థకు అమృత్‌ టెండర్లు, మేఘా, రాఘవ సంస్థలకు అన్ని ప్రాజెక్టుల టెండర్లను రేవంత్‌ పంచి పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పైకి మాత్రమే ఈడీ, సీబీఐ వస్తాయా? తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వ అక్రమాలపై ఎందుకు ఆ సంస్థలు విచారణ చేపట్టడం లేదని నిలదీశారు. పొంగులేటి ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ లో అదానీ కాళ్లు మొక్కి తనకు ఏం కాకుండా బతిమాలుకున్నాడని, అదానీ కొడుకుతో రేవంత్‌ ఇంట్లోనే నాలుగు గంటలు చర్చలు జరిపారని ఆరోపించారు. మోదీ కోసం దామగుండం, అదానీకి సిమెంట్‌ ఫ్యాక్టరీ కట్టబెట్టారని.. రాయదుర్గంలోని విలువైన 84 ఎకరాల భూములను అదానీకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల బాగోతాలను బట్టలిప్పి ప్రజల ముందు నగ్నంగా నిలబెడతామని హెచ్చరించారు.

మేఘా ఇంజనీరింగ్‌ సంస్థను దేశమంతా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. అందరి జాతకాలు చెప్తానంటున్న పొంగులేటి జైలుకు వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. పొంగులేటి ఇంటిపై జరిగిన ఈడీ దాడుల ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ స్కాంలను బయట పెడుతున్న తమను ఇబ్బంది పెట్టినా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. సుంకిశాల ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్టు వెంటనే బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి చిన్న పర్రె పడితే కేసీఆర్‌ ను బద్‌నాం చేశారని.. అందులో ఈ అరాచక శక్తులే ఏదో కుట్ర చేశారనే అనుమానం ఉందన్నారు. ఇప్పటికీ మేడిగడ్డకు రిపేర్లు చేయకుండా అది కొట్టుకుపోవాలని చూస్తున్నారని అన్నారు. ఇరిగేషన్‌ లో కేసీఆర్‌ ఎంతో గొప్పగా పని చేశారని, దేశంలో ఎవరూ చేయని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని అన్నారు. కేసీఆర్‌ కమీషన్ల కోసమే రాయలసీమ లిఫ్ట్‌ ప్రాజెక్టు చేపట్టారని అప్పట్లో విమర్శలు చేశారని.. ఇప్పుడు అదే మేఘా సంస్థకు పనులు ఎలా కట్టబెడుతారని ప్రశ్నించారు. మేఘా కృష్ణారెడ్డి పొలిటికల్‌ మాఫియా అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆరోపించారని గుర్తు చేశారు.

First Published:  6 Nov 2024 1:11 PM IST
Next Story