Telugu Global
Telangana

రేవంత్‌ విధ్వంస పాలకుడు

గుజరాత్‌ తో సమానంగా తెలంగాణలో పత్తికి ధర చెల్లించాలి : మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి

రేవంత్‌ విధ్వంస పాలకుడు
X

రేవంత్‌ రెడ్డి విధ్వంస పాలకుడని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు. పేదల ఇండ్లు కూల్చడమే ఈ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ఇండ్లు కూల్చేయడమే విప్లవాత్మక చర్యలా.. రేవంత్‌ ను విప్లవకారుడిగా పోల్చడం అవివేకమన్నారు. నాలుగేళ్ల పిల్లలు తమ పుస్తకాలు తీసుకుంటామని అడిగితే రాతి గుండెలు కూడా కరుగుతాయని.. ఈ ప్రభుత్వం మనసు మాత్రం కరగడం లేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై ఒంటికాలి మీద లేచిన మేధావులు ఇప్పుడెందుకు నోరు మూసుకున్నారని, ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నడపడానికి అప్పులు తెస్తున్నామని చెప్తున్న వాళ్లు రూ.1.50 లక్షల కోట్లతో మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. తెలంగాణలో పత్తి కొనుగోలుకు సీసీఐ కేంద్రాలు ఎందుకు ఇంకా తెరవలేదని ప్రశ్నించారు. దేశంలోనే నాణ్యమైన పత్తి తెలంగాణలో పండుతోందని, గుజరాత్‌ లో క్వింటాల్‌ పత్తికి రూ.8,257 ఇస్తున్నారని, తెలంగాణ మాత్రం మద్దతు రూ.7,521గానే ఉందని తెలిపారు. వర్షాల కారణంగా రైతులు పత్తిని నిల్వ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, వారికి మద్దతు ధర దక్కక క్వింటాల్‌ పత్తిని రూ.5,500లకే అమ్ముకోవాల్సి వస్తుందని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ముఖ్యులుగా ఉన్న రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు రైతుల కోసం ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. గుజరాత్‌ లో పత్తి రైతులకు ఎక్కువ ధర ఇస్తూ.. తెలంగాణ రైతులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ పై విమర్శలు చేయడం తప్ప వాళ్లు సాధించింది ఏమిటో చెప్పాలన్నారు. రాష్ట్రం నుంచి కేంద్రంలో ఇద్దరు మంత్రులున్నా పత్తి రైతులకు ఎందుకు మెరుగైన ధర ఇప్పించడం లేదో చెప్పాలన్నారు. మూసీ ప్రక్షాళనకు అడ్డొస్తే పండబెట్టి తొక్కుతా అంటున్న ముఖ్యమంత్రికి రైతులపై పట్టింపు లేదా అని ప్రశ్నించారు. వానాకాలం సీజన్‌ అయిపోయినా రైతుబంధు ఇవ్వలేదని, క్వింటాల్‌ కు రూ.500 బోనస్‌ అని హామీ ఇచ్చి, ఇప్పుడు నాణ్యత పేరుతో కోతల పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 44 లక్షల ఎకరాల్లోనే పత్తి సాగు చేస్తే కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో 60 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారని గుర్తు చేశారు. సీసీఐకి లాభాలు తెచ్చిపెట్టిందే తెలంగాణ పత్తి అని.. కానీ ఇక్కడి రైతులకు మంచి ధర మాత్రం చెల్లించడం లేదన్నారు. వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఓపెన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రెస్‌ మీట్‌ లో బీఆర్‌ఎస్‌ నాయకులు రజనీ సాయిచంద్‌, కురవ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

First Published:  16 Oct 2024 2:15 PM IST
Next Story