రేవంత్ మొనగాడు కాదు మోసగాడు
పాలకుర్తి మండలంలోనే 4,314 మందికి రుణమాఫీ కాలే : మాజీ మంత్రి హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డి మొనగాడు కాదు మోసగాడు అని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుధర్నాలో హరీశ్ రావు పాల్గొని మాట్లాడారు. పది నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలను సీఎం మోసం చేశారని అన్నారు. రుణమాఫీ మీదనే మొదట సంతకం అన్నాడని, డిసెంబర్ 9 అని.. ఆగస్టు 15 అని.. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మోసం చేశాడని గుర్తు చేశారు. ఒక్క పాలకుర్తి మండలంలోనే 4,314 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. రైతు రుణాలు మాఫీ చేశా.. హరీశ్ రావు రాజీనామా చేయాలని సీఎం సవాల్ విసురుతుంటే.. ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ చేయనే లేదని వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారని తెలిపారు. పెళ్లి కాలేదని, ఆధార్ కార్డు లేదని వివిధ సాకులు చూపుతూ రుణమాఫీకి ఎగ్గొడుతున్నారని వివరించారు. కర్నాటకలో ఐదు, తెలంగాణలో ఆరు గ్యారంటీలకే దిక్కు లేదంటే హర్యానాలో ఏడు గ్యారంటీలు అని చెప్తున్నారని ఇక వాటి సంగతి ఏమవుతుందోనన్నారు. వరంగల్ లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకకారం కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు. పోడు, అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తానని చెప్పడమే తప్ప అమలు చేయలేదన్నారు. క్వింటాల్ వడ్లకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకే అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో రౌడీ రాజ్యం, హైడ్రా పేరుతో అరాచక రాజ్యం నడుస్తోందన్నారు. మూసీని ఆనుకొని ఉన్న పేదల ఇండ్లు కూలగొట్టాలని చూస్తున్నారని.. ఆ ప్రయత్నాలు చేస్తే తాము ఊరుకోబోమన్నారు. అసెంబ్లీలో రైతుబంధు కమిటీ సిఫార్సులు ప్రవేశపెట్టి చర్చించిన తర్వాతే అమలు చేస్తామని సీఎం అంటుంటే, దసరాకు ఇస్తామని ఒక మంత్రి చెప్తున్నారని తెలిపారు. దసరాలోపే అర్హులందరికీ రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులందరి రుణాలు మాఫీ చేసే వరకు ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టబోమన్నారు. తమ రుణాలు మాఫీ కాలేదని మహబూబాబాద్ లో రవి, సిద్దిపేట జిల్లాలో సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసానేజ రైతుల కన్నీళ్లు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయని.. రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ ఉద్యోగుల జీతాలే ఆపి మరి కేసీఆర్ రైతుబంధు సాయం అందజేశారని తెలిపారు. కాంగ్రెస్ గెలిచిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అని హామీ ఇచ్చారని, పది నెలల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ పరీక్షలు పూర్తి చేసిన 30 వేల ఉద్యోగాలు మినహా రేవంత్ నింపిన ఉద్యోగాలెన్నో చెప్పాలన్నారు. రుణమాఫీ కోసం దసరా తర్వాత ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఎదుట ధర్నా చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చారు. గుండాగిరీ ఎక్కువ కాలం నడువదన్న విషయం రేవంత్ గుర్తు పెట్టుకోవాలన్నారు. మహిళలకు బతుకమ్మ చీరలు ఇవ్వడం లేదు కాబట్ట ఒక్కొక్కరికి రూ.500 చొప్పున నగదు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో తనపై 300 కేసులు పెడితే.. ఈ పది నెలల్లోనే కొత్తగా 30 కేసులు పెట్టారని తెలిపారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. స్టేషన్ ఘన్ పూర్ కు బై ఎలక్షన్ వస్తుందని, డాక్టర్ రాజయ్యను ఎమ్మెల్యేగా గెలిపించాలని పిలుపునిచ్చారు.