Telugu Global
Telangana

నోటిఫికేషన్లు ఇవ్వకుండానే రేవంత్‌ మార్కెటింగ్‌ చేసుకుంటున్నడు

రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చినా చెప్పుకోలేకపోయాం : మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌

నోటిఫికేషన్లు ఇవ్వకుండానే రేవంత్‌ మార్కెటింగ్‌ చేసుకుంటున్నడు
X

నోటిఫికేషన్లు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా సీఎం రేవంత్‌ రెడ్డి మార్కెటింగ్‌ చేసుకుంటున్నారని మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చినా తాము చెప్పుకోలేకపోయామన్నారు. కేసీఆర్‌ వల్లనే తెలంగాణ వచ్చిందని గతంలో చెప్పిన రేవంత్‌.. ఇప్పుడు ఆయనను కొరివి దయ్యం అంటున్నారని.. రేవంత్‌ కు ఎన్ని నాలుకలున్నాయని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం 1.62 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి చెప్పగలరా అని చాలెంజ్‌ చేశారు. కేసీఆర్‌ పాలనలో అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నట్టుగా సీఎం రేవంత్‌, ఆయన కేబినెట్‌ లోని మంత్రులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. టీచర్ల నియామకాల కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చేశారని అన్నారు. ప్రభుత్వంలో ప్రస్తుతం ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో రేవంత్‌ ఇప్పటి వరకు లెక్క తేల్చారా అని ప్రశ్నించారు. రేవంత్‌ నిన్న ఇచ్చిన అపాయింట్‌మెంట్లు 2023 సెప్టెంబర్‌ 6న ఇచ్చిన నోటిఫికేషన్‌ కు కొనసాగింపేనని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ లోని పోస్టులకు రేవంత్‌ ప్రభుత్వం అదనంగా 6 వేల పోస్టులు కలిపిందని తెలిపారు. కోర్టు కేసులను కేసీఆర్‌ ప్రభుత్వమే పరిష్కరించిందన్న విషయం సీఎస్‌ ను అడిగితే చెప్తారన్నారు. కాంగ్రెస్‌ హామీ ఇచ్చినట్టుగా ఈ డిసెంబర్‌ లోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాతే సీఎం మాట్లాడితే మంచిదన్నారు. తనపై రేవంత్‌ తప్పుడు ఆరోపణలు చేశారని.. తాను తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నానని గుర్తు చేశారు. తాను ఏ ఒక్క రోజు పదవుల కోసం పాకులాడలేదన్నారు. తెలంగాణ ఉద్యమంపైకి తుపాకీ గురిపెట్టిన రేవంత్‌ తన కోసం మాట్లాడటం దారుణమన్నారు. దేశ పారిశ్రామికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన రతన్‌ టాటా మరణం దురదృష్టకరమన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని దేశం కోరుతోందన్నారు.

First Published:  10 Oct 2024 8:55 AM GMT
Next Story