రేవంత్ శాడిస్ట్ సీఎం.. నిజాం రాజులా వ్యవహరిస్తున్నడు
బుచ్చమ్మది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : ఎంపీ ఈటల రాజేందర్
రేవంత్ రెడ్డి శాడిస్ట్ సీఎం అని, రాష్ట్ర ప్రజలను ఏడిపించి, వాళ్ల కళ్ల నీళ్లు చూసి ఆనందిస్తున్నాడని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైడ్రా తన ఇల్లు కూల్చేస్తుందనే ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహానికి శనివారం ఆయన నివాళులర్పించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ, బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అన్నారు. రేవంత్ నిజాం రాజులా వ్యవహరిస్తున్నారని, ఆయనను చూస్తుంటే సంజయ్ గాంధీ గుర్తుకు వస్తున్నారని తెలిపారు. సంజయ్ గాంధీ ఢిల్లీలో వేలాది మంది పేదల ఇళ్లను కూల్చివేసి మారుతి కంపెనీకి ఆ భూమిని కట్టబెట్టారని గుర్తు చేశారు. సీఎం అండగా ఉన్నారని హైడ్రా అధికారులు అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని, ఈ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తుందన్నారు. హైడ్రా కూల్చివేతలతో మొన్న ఒకామె గుండె ఆగి చనిపోయారని, ఇప్పుడు బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. శని, ఆదివారం వచ్చిందంటే పేదల ఇండ్లపైకి హైడ్రా బుల్డోజర్లను రేవంత్ పంపుతున్నారని అన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో చైతన్యపురిలో 50 అడుగుల ఎత్తులో ఉన్న ఇంటికి ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు. గత 45 రోజులుగా నల్లచెరువు, అస్మత్ పేట చెరువు, కూకట్ పల్లి చెరువు, బోరబండ చెరువు, ఫీర్జాదిగూడ చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పేరుతో పేదల ఇండ్లను హైడ్రా కూల్చేసిందన్నారు.
అనేక మంది సీఎంలు వచ్చారు, పోయారు కానీ ప్రజల దుఃఖాన్ని చూసి సంతోష పడే సీఎం రేవంత్ రెడ్డి మాత్రమేనన్నారు. ఆరు నెలలుగా అనేక తప్పుడు నిర్ణయాలతో ప్రజలను వేధిస్తున్నారని మండిపడ్డారు. మార్పు కోసమే కాంగ్రెస్ ను గెలిపించారని గుర్తు పెట్టుకోవాలని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. ప్రజల ఉసురు పోసుకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 50 ఏళ్ల క్రితం ఇండ్లు కట్టుకున్న వారిని రివర్ బెడ్ లో ఉన్నారు ఖాళీ చేయాలనడం దుర్మార్గమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించడం, రూ.వేల కోట్లు సంపాదించుకోవడానికే ఇలాంటి పనులు చేస్తున్నాడని అన్నారు. చెరువులను కాపాడుతామని చెప్తోన్న మేధావులు కూల్చివేతలపై ఆలోచన చేయాలన్నారు. రేవంత్ ప్రభుత్వానికి, హైడ్రాకు ఎవరూ భయపడవద్దని, అందరికీ బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. ఆయన వెంట బీజేపీ నాయకులు రవి కుమార్ యాదవ్, మల్లారెడ్డి, గిరివర్ధన్ రెడ్డి, వడ్డేపల్లి రాజేశ్వర్ రావు తదితరులు ఉన్నారు.