రైతన్నలకు రేవంత్ కొత్త పథకం.. ఆరోజు నుంచే అమలు!
ఖరీఫ్ కోసం మే నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలి. లోనింగ్, నాన్ లోనింగ్ రైతులందరికీ రాష్ట్రంలో క్రాప్ ఇన్సురెన్స్ వర్తింపజేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల అమలుపై రేవంత్ సర్కారు ఫోకస్ పెంచింది. ఖరీఫ్ నుంచి పంటల బీమాను అమలు చేయాలని చూస్తోంది. ఇప్పటికే దీనిపై కసరత్తు ప్రారంభించారు అధికారులు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరకుండా సొంతంగానే కొత్త పథకం అమలుకు ప్రణాళికలు రచిస్తోంది రేవంత్ ప్రభుత్వం. రైతు యూనిట్‌గా పథకం అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. జూన్ నుంచే పంటల బీమా పథకం అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు అధికారులు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా పథకం తీసుకొచ్చినా... ఐదెకరాల వరకు ఉన్న రైతులకు ఫ్రీ ప్రీమియం కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రంలో 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. వీరికి పంటల బీమా ప్రీమియం భారం కాకుండా ఉండొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ప్రీమియం పెరగటం, క్లెయిమ్‌లు రాకపోవటం వంటి లోపాలను సవరించాల్సిన అవసరం ఉందంటున్నారు.
ఖరీఫ్ కోసం మే నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలి. లోనింగ్, నాన్ లోనింగ్ రైతులందరికీ రాష్ట్రంలో క్రాప్ ఇన్సురెన్స్ వర్తింపజేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై కీలక సమీక్ష చేయబోతున్నారు. సీఎం సమీక్ష తర్వాత పంటల బీమా విధివిధానాలపై పూర్తి స్పష్టత రానుంది.
ప్రస్తుతం పంట బీమా లేని ఏకైక రాష్ట్రంగా ఉంది తెలంగాణ. మిగతా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన పథకమో లేదా రాష్ట్ర ప్రభుత్వ సొంత పంటల బీమా పథకమో అమలవుతోంది. గుజరాత్, బెంగాల్, బిహార్, ఝార్ఖండ్‌లో ఆయా ప్రభుత్వాలు సొంత పథకాలు అమలు చేస్తున్నాయి. రేవంత్ సర్కారు కూడా సొంతంగానే పథకం తేవాలని చూస్తోంది.