రేవంత్ కు సిగ్గు లేదు.. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకుంటున్నడు
ముత్యాలమ్మ గుడిపై దాడిని ఖండిస్తే నాపై సైబర్ క్రైమ్ వాళ్లు ట్విట్టర్ కు కంప్లైంట్ చేశారు : కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గు లేదని.. అందుకే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకుంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ముఖ్యమంత్రి అనడం సిగ్గు చేటు అన్నారు. తాను అపాయింట్ ఆర్డర్లు ఇచ్చిన వారికి ఎప్పుడు పరీక్షలు నిర్వహించారో సీఎం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుడు అక్టోబర్ లో అశోక్ నగర్‌కు వెళ్ల హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నిరుద్యోగులను నమ్మించి ఏడాది దాటిందన్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినందుకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అశోక్ నగర్ కు వస్తే ఆయనకు సన్మానం చేస్తామన్నారు. నిరుడు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కు వస్తే అప్పటి తమ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తే.. ఇప్పుడు ప్రజాప్రభుత్వమని చెప్పుకుంటూ తమపై నిర్బంధాలు పెడుతున్నారని అన్నారు. పోలీసు అమరవీరులకు నివాళులర్పించేందుకు వెళ్లిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేశారని తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మత ఘర్షణ కూడా జరగలేదని, ముత్యాలమ్మ గుడి ఘటనను తాను ఖండిస్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అని తనపై సైబర్ క్రైమ్ వాళ్లు ట్విట్టర్ కు ఫిర్యాదు చేశారని అన్నారు. ముఖ్యమంత్రికి చేతనైతే శాంతి భద్రతలను కాపాడాలి కానీ సోషల్ మీడియాను ఏదో చేయాలని ప్రయత్నించటం అరాచకమన్నారు.
గ్రూప్ -1 అభ్యర్థుల కోరిక మేరకే కపిల్ సిబల్ లాంటి సీనియర్ లాయర్ ను పెట్టి సుప్రీం కోర్టులో కేసు వేశామన్నారు. శుక్రవారమే విచారణ జరుగుతుందని అనుకున్నామని, సోమవారం విచారణకు రావడంతో పరీక్షలు నిలుపుదల చేయలేదన్నారు. జీవో 29పై తాము లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీం కోర్టు వ్యతిరేకించలేదన్నారు. ఆ జీవోపై తీర్పు వచ్చే వరకు రిజల్ట్స్ ఇవ్వొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించామన్నారు. ఓపెన్ కేటగిరిలో మెరిట్ కనబరిచిన అందరికీ అవకాశం ఇచ్చామన్నారు. రేవంత్ ప్రభుత్వం తెచ్చిన జీవో 29తో ఓపెన్ కోటాలో రిజర్వుడ్ కేటగిరికి అవకాశం లేకుండా పోయిందన్నారు. ఫిబ్రవరి నుంచే ఈ జీవోపై తాము పోరాడుతున్నామని తెలిపారు. ప్రభుత్వమే ప్రశాంతమైన వాతావరణంలో గ్రూప్ -1 పరీక్షలు రాసే అవకాశం లేకుండా చేసిందన్నారు. కోర్టు కేసు తేలేదాకా అభ్యర్థులకు తాము అండగా ఉంటామన్నారు. బీఆర్‌ఎస్ పై తప్పుడు ప్రచారం చేసి నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు అదే నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందన్నారు. గ్రూప్ -4 అభ్యర్థులకు తాము అండగా ఉంటామన్నారు. ప్రభుత్వాలు భేషజాలకు పోవద్దని, ప్రజాస్వామ్యంలో ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసి ఉండాలన్నారు. రాజ్యాంగం ద్వారా దక్కిన రిజర్వేషన్లకు తూట్లు పోవడాన్ని మించిన దుర్మార్గం ఇంకొకటి లేదన్నారు.
సిరిసిల్ల పవర్ లూమ్ కు.. అధానీకి ఒక్కటే కరెంట్ బిల్లా?
సిరిసిల్లలో చేనేత కార్మికుడు నడుపుకునే పవర్ లూమ్ కు, బడా పారశ్రామికవేత్త అదానీ పెట్టే పరిశ్రమకు ఒక్కటే కరెంట్ బిల్లా అని ప్రశ్నించారు. ప్రభుత్వం పెంచబోయే కరెంట్ చార్జీల ప్రతిపాదనల్లో పరిశ్రమలన్నీ ఒక్కటే కేటగిరిలో చేర్చే అంశం కూడా ఉందన్నారు. 300 యూనిట్లకు మించి కరెంట్ వాడే గృహ వినియోగదారులపైనా భారీ కరెంట్ బిల్లుల భారం మోపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కరెంట్ బిల్లుల భారం మోపితే అన్నివర్గాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తామన్న ఫాక్స్ కాన్ కంపెనీ.. ఇప్పుడు తెలంగాణలో పరిశ్రమ విస్తరణపై నోరు మెదపడం లేదన్నారు. ఇప్పటికే పలు పరిశ్రమలు తరలిపోయాయని, కరెంట్ బిల్లులు భారీగా పెంచితే అనేక పరిశ్రమలు మూతపడే ప్రమాదముందన్నారు. కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదన మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై ఈఆర్సీని కలిసి వినతిపత్రం ఇచ్చామని, ఈనెల 23 నుంచి నిర్వహించే పబ్లిక్ హియరింగ్ లో పాల్గొని ప్రజల తరపున వాదనలు వినిపిస్తామన్నారు.
జర్నలిస్టులకు బీఆర్‌ఎస్ రాజకీయంగా అనేక అవకాశాలు కల్పించిందని, అలాంటి తాను జర్నలిస్టులను అవమానించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మూసీ పేరుతో కండ్ల ముందే భారీ కుంభకోణం జరుగుతుంటే ప్రశ్నించొద్దా అన్నారు. రైతు భరోసా ఇచ్చేందుకు పైసలు లేవు కానీ మూసీ ప్రాజెక్టు కోసం రూ.1.50 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దామగుండంలో రాడార్ సెంటర్ కు, మూసీకి దిగువన అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చి ఇంకా మూసీ పునరుజ్జీవం అంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. సీఎం సొంతూరిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి జరిగితే ఎందుకు జర్నలిస్టులు మాట్లాడలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు జర్నలిస్టులపై దాడులు జరిగాయన్నారు. మూసీ లూటీని కవరప్ చేసేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోందన్నారు. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ రహస్య స్నేహితుడని అన్నారు. అందుకే మంత్రులు రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని సంజయ్ బాధ పడుతున్నాడని అన్నారు. పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్ జరిగి 20 రోజులైనా ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. కర్నాటకలో తమ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందని సిద్ధరామయ్య అంటుంటే.. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ దోస్తీ చేస్తున్నాయని తెలిపారు. కర్నాటక వాల్మీకీ స్కాంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల హస్తం ఉన్నా ఇంతవరకు ఒక్క అరెస్టు కూడా ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. అమృత్ టెండర్లలో అక్రమాలపై తాను కేంద్ర మంత్రికి లేఖ రాసినా ఇంతవరకు స్పందించలేదన్నారు.