ప్రొఫెసర్ కోదండరామ్‌కు విద్యాశాఖ ఇవ్వాలే
రేవంత్‌కు పాలన చేతగాక బీఆర్‌ఎస్‌పై నిందలు వేస్తున్నరు: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
రేవంత్ రెడ్డికి పాలన చేతగాక బీఆర్‌ఎస్ పై నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ బీఆర్‌ఎస్ కుట్ర అనడానికి సిగ్గుండాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా మంత్రివర్గ విస్తరణ చేసే సత్తా ఈ ముఖ్యమంత్రికి లేదన్నారు. రాష్ట్రంలో పలు శాఖలకు మంత్రులు లేకపోవడమే ప్రభుత్వ వైఫల్యాలకు కారణమన్నారు. అత్యంత కీలకమైన విద్యాశాఖకు మంత్రి లేడని, ఆ శాఖ ప్రాధాన్యత ఈ ముఖ్యమంత్రికి తెలియదన్నారు. తన కిష్టమైన మంత్రులను మాత్రమే కలుస్తున్న సీఎం ఇక అధికారులను ఏం కలుస్తాడు.. ఆయా శాఖల్లోని లోపాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. కనీసం కోదండరామ్ కు లేద తన శత్రువులుగా ఉన్న మంత్రులకైనా విద్యాశాఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురుకులాల్లో పిల్లల భద్రతపై వాళ్ల తల్లిదండ్రులు ఆందోళనతో ఉన్నారని తెలిపారు. ఆదివారం తమ బిడ్డలను కలిసేందుకు తల్లిదండ్రులు వెళ్తే వాళ్లకు కనీసం అనుమతి ఇవ్వలేదని, గురుకులాలు ఏమైనా జైళ్లా అని ప్రశ్నించారు.
ఏడాది పాలనలో రేవంత్ సత్తా ఏమిటో తెలిసిపోయిందని, ఆయన పోలీసులతోనే పాలన చేస్తున్నారని అన్నారు. ఏదో సాధించినట్టుగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని అంటున్నారని.. గురుకులాలు చూసేందుకు వెళ్తోన్న విద్యార్థి నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ హాయంలో ఆర్ఎ.స్. ప్రవీణ్ కుమార్ గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దితే రేవంత్ వాటిని నాశనం చేస్తున్నారని అన్నారు. గురుకుల విద్యార్థులు ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాలను అధిరోహించారని, ఇప్పటి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. గురుకులాల్లో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో కమిటీ వేశామన్నారు. గురుకులాల్లోకి వెళ్లేందుకు విద్యార్థి సంఘాలను అనుమతించకపోతే.. విద్యార్థులే స్వచ్ఛందంగా రోడ్ల మీదికి వస్తున్నారని తెలిపారు. తమను లగచర్లకు వెళ్లనివ్వలేదని, మహబూబాబాద్‌లో మీటింగ్ పెట్టుకుంటామని అనుమతి ఇవ్వలేదని.. ఎన్ని రోజులు నిర్బంధాలతో పాలన సాగిస్తావని ప్రశ్నించారు. ఎన్ని వడ్లు కొన్నారో లెక్కలు చెప్పడం లేదని, ఎంత మందికి రుణమాఫీ చేశారో ఎక్కడైనా తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. రైతుబంధు కన్నా బోనస్ బాగుందని చెప్పడానికి మంత్రికి సిగ్గుండాలని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో పోలీసులకు తప్ప ఇంకెవరికీ పని లేదన్నారు. దోచుకున్న మూటలు ఢిల్లీకి పంపడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏదీ చేతకావడం లేదన్నారు. ఏం చేశారని సంబురాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఒక్క ఎన్‌కౌంటర్ జరిగితే కేసీఆర్ పోలీసులకు క్లాస్ తీసుకున్నారని, రేవంత్ హయాంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 14 మంది చనిపోయారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లపై న్యాయ విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంకా ప్రభుత్వాన్ని నడిపేది బీఆర్‌ఎస్ అన్నట్టుగా తమపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.