వానాకాలానికీ రైతు భరోసా లేనట్లే..
రేవంత్ సర్కార్ మాత్రం రైతుల ఆశలను అడియాశలు చేసింది. పాత పద్ధతిలోనే అంటే కేసీఆర్ ఇచ్చినంత సొమ్మునే రైతుల ఖాతాలో వేసి చేతులు దులుపుకుంది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఇస్తూ వచ్చింది. రైతుబంధు పేరిట ఏడాదికి రెండు విడతల్లో పదివేల రూపాయల సాయం అందించింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులకు పెట్టుబడి సాయం పెంపు హామీ ఇచ్చింది. కేసీఆర్ ఏడాదికి రూ.10 వేలు ఇస్తే తాము ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆశ చూపింది. దీంతో రైతులు బీఆర్ఎస్‌ను కాదని కాంగ్రెస్ వైపు మళ్లారు.
కానీ, రేవంత్ సర్కార్ మాత్రం రైతుల ఆశలను అడియాశలు చేసింది. పాత పద్ధతిలోనే అంటే కేసీఆర్ ఇచ్చినంత సొమ్మునే రైతుల ఖాతాలో వేసి చేతులు దులుపుకుంది. హామీని విస్మరించి రైతుభరోసా సాయం పెంచకపోవడంపై ప్రతిపక్షాలతో పాటు రైతులు రేవంత్ సర్కారుపై ఆగ్రహంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో నిన్న గంటల తరబడి జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు రైతుభరోసాపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఖరీఫ్‌కు కూడా రైతుభరోసా ఇవ్వట్లేదని ఆయన స్పష్టం చేశారు. రైతుభరోసా ఎప్పుడు వేస్తారు అని మీడియా ప్రతినిధి అడగిన ప్రశ్నకు శ్రీధర్‌బాబు ఏమన్నారంటే.. "ఎకరానికి రూ. 15 వేలు రైతు భరోసా కింద ఇవ్వాలంటే విధివిధానాలు, నిబంధనలు ఖరారు చేయాలి. ఖరీఫ్ పంట అయిపోయిన తరువాత చూద్దాం. ప్రజలకు ఇచ్చిన హమీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తాం. రైతుబంధుతో పాటు మిగతా హామీలను కూడా నెరవేరుస్తాం"అన్నారు. దీంతో ఈసారి కూడా రైతుభరోసా లేదని తేలిపోయింది.