Telugu Global
Telangana

ఫ్రీ కరెంట్‌కు 2 కండీషన్లు

ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు ఇవ్వని వాళ్లు మీ కరెంట్ కనెక్షన్‌ ఉన్న ప్రాంతానికి చెందిన ఎంపీడీవో లేదా మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా ఇవ్వొచ్చు.

ఫ్రీ కరెంట్‌కు 2 కండీషన్లు
X

గృహజ్యోతి పథకానికి మార్గదర్శకాలు విడుదల చేసింది రేవంత్ ప్రభుత్వం. ఫ్రీ కరెంట్‌కు తెల్లరేషన్‌ కార్డే ప్రామాణికం అని తెలిపింది. ప్రజాపాలన దరఖాస్తుల సమయంలో ఎవరైతే రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, కరెంట్‌ కనెక్షన్ నంబర్లు ఇచ్చారో వారే గృహజ్యోతి పథకానికి అర్హులు. ఎన్నికల హామీ ప్రకారం 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌ ఇవ్వనుంది ప్రభుత్వం. అంతకుమించితే పూర్తి బిల్లు వినియోగదారుడే చెల్లించాలి. 200యూనిట్లలోపు కరెంట్‌ వాడుకున్నవారికి జీరో బిల్లులు జారీ చేయనున్నారు. వచ్చే నెల మొదటివారంలో జీరో బిల్లులు జారీ చేసే అవకాశముంది. ఈ బిల్లుల మొత్తాన్ని 20వ తేదీకల్లా డిస్కంలకు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌ను ఇంటి వినియోగానికి మాత్రమే వాడాలి. ఇతర అవసరాలకు వాడుకుంటే కేసులు పెట్టి, చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు ఇవ్వని వాళ్లు మీ కరెంట్ కనెక్షన్‌ ఉన్న ప్రాంతానికి చెందిన ఎంపీడీవో లేదా మున్సిపల్‌, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లో ఎప్పుడైనా ఇవ్వొచ్చు. వారికి కార్యాలయాల్లో రశీదు ఇస్తారు. దాన్ని సమీపంలోని విద్యుత్‌, రెవెన్యూ కార్యాలయంలో అందజేయాలి. అనంతరం ఆ దరఖాస్తుదారు ఇంటికి కరెంట్ సిబ్బంది వెళ్లి రేషన్‌ కార్డు, ఆధార్‌ వివరాలను తనిఖీ చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే అర్హుల జాబితాలో చేరుస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఎవరైనా ఆయా కార్యాలయాల్లో అర్జీలు, రశీదులు అందజేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది.

మార్చిలో 40 లక్షల నుంచి 60 లక్షల వరకు ఇళ్లకు జీరో బిల్లులు రావొచ్చని అనధికారికంగా అంచనా వేస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి 20వ తేదీ వరకూ జీరో బిల్లులు జారీ అయిన తర్వాత మాత్రమే, మొదటి నెలలో ఈ పథకం కింద ఎంతమంది అర్హత పొందారన్న లెక్కలు తేలనున్నాయి. ప్రస్తుత విద్యుత్ ఛార్జీల ప్రకారం లెక్కలు వేస్తే నెలలో కచ్చితంగా 200 యూనిట్లు వాడుకునే ఇంటికి దాదాపు రూ.900 వరకు ఆదా కానుంది.

First Published:  28 Feb 2024 11:53 AM IST
Next Story