Telugu Global
Telangana

ఎకరాకు రూ. 10వేలు.. రేవంత్ సర్కారు కీలక నిర్ణయం

అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.

ఎకరాకు రూ. 10వేలు.. రేవంత్ సర్కారు కీలక నిర్ణయం
X

అకాల వర్షాలు, వడగళ్ల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరాకు రూ.10 వేలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటివరకు జరిగిన పంటనష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయశాఖను ఆదేశించింది రేవంత్ సర్కారు. వచ్చే రెండుమూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉండటంతో అప్పటివరకు జరిగే మొత్తం నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకుని పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. కేసీఆర్‌ హయాంలో కూడా గతేడాది తీవ్రమైన వర్షాలతో పంట నష్టం జరిగింది. దాంతో అప్పుడు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇచ్చారు. అదే తరహాలో ఇప్పుడు కూడా పరిహారం ఇవ్వాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది.

మరో రెండుమూడు రోజులుగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్‌ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగు సూచనలు ఇవ్వాలని ఆదేశించింది. మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యం, మిర్చి సహా ఇతర పంటలు దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంది. కల్లాల్లోగానీ, ఇతర ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యంగానీ దెబ్బతినకుండా రైతులకు సూచనలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.

అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరి, మొక్కజొన్న, జొన్న, పొగాకు, వేరుశనగ, మిర్చి, కూరగాయలు, బొప్పాయి, ఉల్లి పంటలు దెబ్బతిన్నాయి. వరి పొలాలకు నీరు లేక ఎండిపోయి దెబ్బతిన్నాయి. ఈ వర్షాల వల్ల ఉన్న కాస్త ధాన్యం కూడా రాలిపోయింది. నిజామాబాద్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ నిర్థారించింది. మిగిలిన జిల్లాల్లోనూ పంటలకు ఏమైనా నష్టం జరిగిందా లేదా అన్న వివరాలు పంపించాలని జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించింది.

First Published:  20 March 2024 9:21 AM IST
Next Story