Telugu Global
Telangana

ఆ రెండు స్థానాలు మైనంపల్లికే.. కన్ఫామ్‌ చేసిన రేవంత్‌

ఎన్నో ఏళ్లుగా పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్న నందికంటి శ్రీధర్‌ను వదిలేసి.. బయటి వారికి టికెట్లు ఇస్తామంటే ఊరుకునేది లేదంటున్నారు.

ఆ రెండు స్థానాలు మైనంపల్లికే.. కన్ఫామ్‌ చేసిన రేవంత్‌
X

మైనంపల్లి హన్మంతరావుకు రెండు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్‌చాట్‌ సందర్భంగా రేవంత్‌ మైనంపల్లి అంశంపై క్లారిటీ ఇచ్చారు. గురువారం సాయంత్రం మైనంపల్లి కాంగ్రెస్‌ పార్టీలో చేరతారని స్పష్టం చేశారు. ఇటీవలే బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు మైనంపల్లి. తనకు, తన కొడుకు రోహిత్‌తో పాటు అనుచరుడు నక్కా ప్రభాకర్ గౌడ్‌కు టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్‌ రెండు టికెట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

మైనంపల్లి మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తారా లేదా మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌ స్థానాల నుంచి పోటీ చేస్తారా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే.. స్థానిక కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎంతవరకు సహకరిస్తారనేది అనుమానస్పదంగా మారింది. మల్కాజిగిరి టికెట్‌ మైనంపల్లికి ఇస్తే ఊరుకునేది లేదని కార్యకర్తలు ఇప్పటికే పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని, కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్న నందికంటి శ్రీధర్‌ను వదిలేసి.. బయటి వారికి టికెట్లు ఇస్తామంటే ఊరుకునేది లేదంటున్నారు.

మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ టికెట్‌ను నందికంటి శ్రీధర్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం మేడ్చల్‌ డీసీసీగా ఉన్న నందికంటి.. 1994 నుంచి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో కౌన్సిలర్‌, కార్పొరేటర్‌గానూ పని చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో పొత్తులో భాగంగా మల్కాజిగిరి స్థానాన్ని తెలంగాణ జనసమితికి కేటాయించగా.. కపిలవాయి దిలీప్‌కుమార్‌కు సీటు త్యాగం చేశారు నందికంటి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి రేవంత్‌ ఎంపీగా గెలవడంలోనూ నందికంటి కీ రోల్‌ ప్లే చేశారు. 2019లోనే మల్కాజిగిరి టికెట్‌పై తనకు హామీ ఇచ్చారని పదేపదే చెప్తున్నారు నందికంటి. తాజాగా పీసీసీ చీఫ్‌ రేవంత్ చేసిన ప్రకటనతో.. శ్రీధర్‌ తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది.

First Published:  28 Sept 2023 7:23 AM IST
Next Story