లండన్‌లో రేవంత్‌తో అక్బరుద్దీన్.. కాంగ్రెస్, MIM దోస్తీ..?
కాంగ్రెస్‌తో భవిష్యత్తులో పొత్తు ఉండదని MIM ఇప్పటికే ప్రకటించినప్పటికీ.. లండన్‌లో రేవంత్‌తో అక్బరుద్దీన్ ఫొటోలు సోషల్‌మీడియాలో కనిపించడంతో మరోసారి ఊహగానాలు మొదలయ్యాయి.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డితో MIM ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ లండన్‌లో సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్, MIM పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలయ్యాక అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ చేయడంతో MIMతో కాంగ్రెస్ స్నేహం కోరుకుంటోందన్న ప్రచారం జోరుగా సాగింది.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ లండన్‌లోని 309 మీటర్ల ఎత్తైన ఆకాశహార్మ్యం నుంచి థేమ్స్ నది రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చూస్తున్న ఫొటోను తెలంగాణ సీఎంవో ట్వీట్ చేసింది. తర్వాత అక్బరుద్దీన్ ఓవైసీ సైతం మూసీ నది పునరుజ్జీవనకు సంబంధించిన ప్రజంటేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చూసిన వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.
అయితే కాంగ్రెస్‌తో భవిష్యత్తులో పొత్తు ఉండదని MIM ఇప్పటికే ప్రకటించినప్పటికీ.. లండన్‌లో రేవంత్‌తో అక్బరుద్దీన్ ఫొటోలు సోషల్‌మీడియాలో కనిపించడంతో మరోసారి ఊహగానాలు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో 12 స్థానాలు గెలవాలని కాంగ్రెస్ టార్గెట్‌గా పెట్టుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు సీట్లు మాత్రమే గెలుచుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్.. MIMను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.